గుంటూరు : రాజుపాలెం మండలం దేవరంపాడు లో స్వయంభుగా వెలసిన నేతి వెంకన్న స్వామి
ఆలయానికి ఎన్నో ప్రతిష్టతలు ఉన్నాయని, తొలి శనివారం తిరుణాళ్ల వేడుకల్లో
పాల్గొనడం ఆ స్వామి వారి వరం గా భావిస్తున్నానని రాష్ట్ర డిప్యూటీ సీఎం,
దేవాదాయ ధర్మాదాయ శాఖామాత్యులు కొట్టు సత్యనారాయణ అన్నారు. ఆయన శనివారం
రాష్ట్ర జలవనరుల శాఖా మాత్యులు అంబటి రాంబాబుతో కలిసి పూజా కార్యక్రమాల్లో
పాల్గొన్నారు. ముందుగా స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. వారితోపాటు
నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు పల్నాడు జిల్లా
కలెక్టర్ లో తోటి శివశంకర్ లు ఉన్నారు. స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు
చేశారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ గతంలో ముఖ మండపం నిర్మాణానికి
దేవాదాయ శాఖ నుంచి రూ. 99 లక్షల నిధులు మంజూరు చేశామని ముఖ మండపం మిగిలిన
నిర్మాణం పూర్తయ్యే వరకు అవసరమైన నిధులను మంజూరు చేస్తామని ప్రకటించారు.
నేతి వెంకన్న స్వామి ఆలయం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రత్యేకమైనదిగా
అనేక విశిష్టలు ఉన్నాయన్నారు. స్వయంభుగా వెలవడం, స్వామి వారి తిరుణాల వేడుకలు
నాలుగు శనివారాలపాటు జరగటం, గర్భగుడి పై భాగం తెరిచి ఉండటం, సూర్యకిరణాలను
తాకి స్వామివారు మత్స్య అవతారంలో దర్శనం ఇవ్వటం వంటి అనేక ప్రత్యేకతలు కలిగి
ఉండటం విశేషం అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం నుండి కూడా నిధులు మంజూరుకు
సహకరిస్తామన్నారు. రాష్ట్ర జలవనరుల శాఖా మాత్యులు అంబటి రాంబాబు ప్రత్యేక
చొరవ,కంకణబద్ధులై ఆలయాన్ని గతంలో ఎవరూ, ఎన్నడు చేయని రీతిలో అభివృద్ధి చేయటం
స్ఫూర్తిదాయకమన్నారు. అంబటి కృషికి సహకరిస్తామన్నారు.