విజయవాడ : ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు వ్యవహారశైలిపై పలువురు
నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ఏపీ బీజేపీ మాజీ
అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ పార్టీకి గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే.
రాజీనామా సమయంలో సోము వీర్రాజుపై కన్నా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర
నాయకత్వం నచ్చకపోవడంతో పార్టీకి రాజీనామా చేసినట్లు ఆయన తెలిపారు. ఇప్పుడు
కన్నా బాటలోనే పలువురు నడుస్తున్నట్లు తెలుస్తోంది. సోము వీర్రాజు తీరుపై
విసుగెత్తిపోయిన పలువురు అసమ్మతి నేతలు ఢిల్లీ బాటపట్టారు. గురువారం పలువురు
ఏపీ బీజేపీ నేతలు ఢిల్లీకి చేరుకున్నారు. మధ్యాహ్నం ఏపీ బీజేపీ రాష్ట్ర
ఇంచార్జ్ మురళీధరన్ తో నేతలు భేటీ అయ్యారు. పలు జిల్లాల బీజేపీ మాజీ
అధ్యక్షులు, వివిధ స్థాయుల్లో పార్టీకి పనిచేసిన నేతలు మురళీధరన్‌తో భేటీ
అయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడు సహా నాయకత్వాన్ని మార్చాలని అసమ్మతి నేతలు
కోరారు. సుమారు 30 మంది బీజేపీ నేతలు మురళీధరన్‌తో సమావేశంకానున్నారు. రాష్ట్ర
నాయకత్వంపై ఫిర్యాదు చేసేందుకు రాష్ట్ర నాయకత్వాన్ని మార్చాలని పది జిల్లాలకు
చెందిన నేతలు డిమాండ్ చేశారు. జమ్ముల శ్యామ్ కిషోర్, చిగురుపాటి కుమారస్వామి,
తుమ్మల అంజిబాబు, ధారా సాంబయ్య, బాలకోటేశ్వరరావు, ఉప్పలపాటి శ్రీనివాసరాజు,
శ్రీమన్నారాయణ, సుబ్బయ్య, హనుమంతు, ఉదయ భాస్కర్ సహా 30 మంది నేతలు ఢిల్లీకి
చేరుకున్నారు.
ఢిల్లీ చేరిన ఏపీ బీజేపీ పంచాయితీ : ఏపీ బీజేపీలో ముసలం చోటుచేసుకుంది.
కొద్దిరోజుల క్రితం కన్నా లక్ష్మీనారాయణ బీజేపీకి రాజీనామా చేసిన విషయం
తెలిసిందే. తర్వాత పార్టీలో చోటుచేసుకున్న పరిణామాలపై అసంతృప్తి నేతలు
ఒక్కసారిగా తమ గళం వినిపించారు. ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజుపై ఫిర్యాదు
చేసేందుకు కాషాయ నేతలు ఏకంగా ఢిల్లీకి వెళ్లారు. దాదాపు 30 మంది ఏపీ బీజేపీ
నేతలు ఢిల్లీకి వెళ్లి రాష్ట్ర ఇంఛార్జ్ మురళీధరన్‌తో భేటీ అయ్యారు. ఈ
సందర్భంగా సోము వీర్రాజు వ్యవహార శైలిపై ఫిర్యాదు చేశారు. అధ్యక్షుడిగా సోము
వీర్రాజు తమకు వద్దంటూ ఇంఛార్జ్ వద్ద మొరపెట్టుకున్నారు. నూతన అధ్యక్షుడు
కావాలని పట్టుబట్టారు. రాష్ట్రంలో సోము వీర్రాజు ఏకపక్ష నిర్ణయాలు
తీసుకుంటున్నారని, సీనియర్ నేతలకు ప్రాధాన్యత ఇవ్వడంలేదని ఫిర్యాదు చేశారు.
ఆరు జిల్లాల అధ్యక్షులను తొలగించారని ఈ సందర్భంగా వారు చెప్పుకొచ్చారు. అయితే
ఢిల్లీకి వచ్చిన ఏపీ బీజేపీ నేతలకు మురళీధరన్ క్లాస్ ఇచ్చినట్టు
తెలుస్తోంది. పార్టీ అంతర్గత విషయాలపై రచ్చకెక్కొద్దని వార్నింగ్ ఇచ్చినట్టు
సమాచారం. ఈ క్రమంలోనే ఇంత మంది ఒకేసారి ఢిల్లీకి ఎందుకు వచ్చారని
ప్రశ్నించడంతో వారు ఖంగుతిన్నారు. ఇక, ఢిల్లీలో దిగిన 30 మంది ఏపీ బీజేపీ
ద్వితీయ శ్రేణి నాయకులతో 20 నిమిషాల పాటు మాట్లాడి పంపించేశారు. తాను
రాష్ట్రానికి వచ్చినప్పుడు కలవాలని వారికి సూచించారు. ఇకపై రాష్ట్ర
పరిస్థితులను పరిష్కరించేందుకు ప్రతి నెల సమయం ఇస్తానని మురళీధరన్ తమకు హామీ
ఇచ్చారని స్థానిక నేతలు చెబుతున్నారు.