విజయవాడ: విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు
హోం, విపత్తు నిర్వహణ శాఖ, ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డా.తానేటి వనిత
ముఖ్యఅతిథిగా విచ్చేసారు. ఇందిరా నాయక్ నగర్, న్యూ రాజేశ్వరిపేట, ఎల్ బి ఎస్
నగర్, 64 వ డివిజన్ లలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ
కార్యక్రమంలో నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు, సెంట్రల్ నియోజకవర్గ
ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ రుహుల్లా, మేయర్ భాగ్యలక్ష్మి, డిప్యూటీ
మేయర్ అవుతు శైలజా రెడ్డి, కార్పొరేటర్లు, డివిజన్ ఇంచార్జి నాయకులు, మహిళా
నేతలు, స్థానిక వైస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు. సెంట్రల్ నియోజకవర్గం 64వ
డివిజన్ లోని కండ్రిగ జంక్షన్ నుండి నూజివీడు రోడ్డు వరకు దాదాపు 3 కోట్ల 65
లక్షల విలువైన అభివృద్ధి పనులకు హోంమంత్రి డా.తానేటి వనిత శంకుస్థాపన చేశారు.
అదేవిధంగా 62వ డివిజన్ లోని ఎల్ బి ఎస్ నగర్ లో కాపు కమ్యూనిటీ హాల్ కు
శంకుస్థాపన చేశారు. ఇందిరానాయక్ నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన అర్బన్ ప్రైమరీ
హెల్త్ సెంటర్ ను ప్రారంభించారు. న్యూ రాజేశ్వరి పేటలో ఇళ్ల రిజిస్ట్రేషన్
ఫీజులు, స్టాంప్ డ్యూటీలు, ట్రాన్స్ఫర్ డ్యూటీ లకు సంబంధించిన కార్యక్రమంలో
హోంమంత్రి తానేటి వనిత పాల్గొన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి
వచ్చిన తరువాత ఏదో ఒక రూపంలో మంచి జరుగుతూనే ఉందని హోంమంత్రి తానేటి వనిత
స్పష్టం చేశారు. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా, క్షేత్రస్థాయిలో పేదవాడికి
మంచి చేయాలనే ఆలోచనతో సీఎం జగన్ పనిచేస్తున్నారని తెలిపారు. సీఎం జగన్
తీసుకుంటున్న నిర్ణయాలు, పరిపాలన విధానాలు పేదల జీవితాల్లో పెను మార్పులు
తీసుకువచ్చాయని పేర్కొన్నారు. గడప గడపకు కార్యక్రమంలో తిరుగుతున్నప్పుడు ఒక్కో
కుటుంబంలో ఐదారు సంక్షేమ పథకాలు అందుతున్న పరిస్థితులను స్వయంగా చూసాము
అన్నారు. సచివాలయ సిబ్బంది ద్వారా ప్రజల ఇంటి వద్దకే లబ్ధిదారుల ఇంటి వద్దకే
సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత సీఎం జగన్ గారికే దక్కుతుందన్నారు. విజయవాడ
సెంట్రల్ నియోజకవర్గంలో దాదాపు ఏడు వేల మందికి ఇళ్ల స్థలాల మీద హక్కు కలిగించే
విధంగా రిజిస్ట్రేషన్ పక్రియ చేపట్టిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు ని హోంమంత్రి
తానేటి వనిత మనస్ఫూర్తిగా అభినందించారు.