గుంటూరు : సుదీర్ఘకాలం తెలుగుదేశం వ్యతిరేక శిబిరానికి నాయకత్వం వహించి
ఇప్పుడు అదే పార్టీ ‘సైకిల్’ ఎక్కబోతున్న మాజీ మంత్రి, మాస్ లీడర్ కన్నా
లక్ష్మీనారాయణ టీడీపీలో సర్దుకుపోగలరా? అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి కోట్ల,
చెన్నారెడ్డి, నేదురుమల్లి, వైఎస్ తురుపుముక్కగా పనిచేసిన కన్నా, ఇప్పుడు
టీడీపీకి తురుపుముక్క కాగలరా? దశాబ్దాల పాటు సభలో-బయటా చంద్రబాబు నాయుడును
కడిగేసిన కన్నా, ఇప్పుడు అదే బాబుతో కలసి అడుగులేయగలరా? అన్న ప్రశ్నలు
తలెత్తుతున్నాయి.
చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నా ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నా కాంగ్రెస్ తరపున
అస్త్రశస్త్రాలు సంధించే నాయకుడాయన. అలాంటి కన్నా ఇప్పుడు తాను ఎదురుదాడి
చేసిన అదే టీడీపీ తీర్థం తీసుకున్నారు. విచిత్రంగా ఉంది కదూ?!. రాజకీయమంటే అదే
మరి. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు-శాశ్వత మిత్రులూ ఉండరన్న, దేవరాజ్ ఆర్స్
సిద్ధాంతం మరోసారి రుజువైన సందర్భం. అలాంటి మాస్ ఇమేజ్ ఉన్న కన్నా
లక్ష్మీనారాయణ టీడీపీలో సర్దుకుపోగలరా? ఆయన స్థాయికి తగ్గ గౌరవం టీడీపీ
నాయకత్వం ఇస్తుందా? ప్రధానంగా కాపు నేతలున్న పార్టీలో, అదే కులంలో మాస్ ఇమేజ్
ఉన్న కన్నా రాకను కాపు నేతలు జీర్ణించుకుంటారా? గుంటూరు జిల్లాలో పాతుకుపోయి,
మంత్రి పదవుల కోసం కాచుకుని ఉన్న సీనియర్లు, కన్నా రాకను మనస్ఫూర్తిగా
ఆహ్వానించి, ఆయనతో కలసి పనిచేస్తారా? బహు నాయకత్వం ఉన్న కాంగ్రెస్, మరో జాతీయ
పార్టీ అయిన బీజేపీలో పనిచేసిన కన్నా ఏక నాయకత్వం ఉన్న టీడీపీలో ఇమడగలరా?
ఇప్పుడు అందరినీ ఆసక్తికి గురిచేస్తున్న అంశం ఇదే. కాపు నేత, మాజీ మంత్రి
కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం తీర్ధంతో రాజధాని గుంటూరు జిల్లాతోపాటు,
కులరాజకీయ సమీకరణల్లో మార్పు వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
సైద్ధాంతికంగా తెలుగుదేశం పార్టీని వ్యతిరేకించే కన్నా లక్ష్మీనారాయణ,
టీడీపీలో చేరతారని బహుశా ఆయనతో సహా ఎవరూ ఊహించి ఉండరు. జాతీయ పార్టీ బీజేపీ
నిరాదరణ, వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ ఒంటెత్తు వైఖరి, జనసేనాధిపతి పవన్
కల్యాణ్ రాజకీయ అనుభవ రాహిత్యం కలసి వెరసి ఆయనను, టీడీపీ వైపు అడుగులు
వేసేందుకు కారణం అయి ఉండవచ్చు. పైగా కన్నా సమర్థత, రాజకీయ వ్యూహాలపై
చంద్రబాబుకు ఉన్న అవగాహన కన్నా రాజకీయ ప్రత్యామ్నాయ ఎంపిక అందుకు దోహదపడి
ఉండవచ్చు. కాపు నేత అయిన కన్నా, జనసేనను ఎంచుకోకుండా, టీడీపీని ఎంపిక
చేసుకన్నారంటే ఆయనకున్న రాజకీయ అనుభవం-ముందుచూపు ఎంత విస్తృతమయిందో
ఊహించుకోవచ్చు. ఆయన ఒకవేళ జనసేనలో చేరితే, మరో పవర్ సెంటర్ అవుతారు.
యోధానుయోధులైన సీఎంల వద్ద పనిచేసిన కన్నా సొంత వ్యక్తిత్వం, దూకుడును, జనసేనలో
చేరితే పవన్ తట్టుకోలేరు. అదీ కాకపోతే మహా అయితే కన్నా, జనసేనలో నెంబర్టూ
స్థాయికి చేరవచ్చు. అయినప్పటికీ, క్యాడర్ , పార్టీ నిర్మాణం లేని జనసేనలో
చేరి, కన్నా సాధించేది శూన్యం. బహుశా అలాంటి అంచనాతోనే ఆయన జనసేన వైపు
మొగ్గుచూపి ఉండకపోవచ్చు.