ఏపీ స్టేట్ హజ్ కమిటీ చైర్మన్ బద్వేల్ షేక్ గౌసల్ ఆజామ్, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా
విజయవాడ : రాష్ట్ర ప్రభుత్వం హజ్ యాత్రికులకు శుభవార్త చెప్పిందని ఏపీ స్టేట్
హజ్ కమిటీ చైర్మన్ బద్వేల్ షేక్ గౌసల్ ఆజామ్ అన్నారు. బుధవారం విజయవాడలో
ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2023 హజ్ యాత్రికుల కోసం
తామంతా సమావేశం నిర్వహించుకుని పలు నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. గతేడాది
1100 మంది హజ్ యాత్రకు వెళ్లారని, ఈసారి రెట్టింపు చేయడంతో 3 వేల మంది వరకు
వీసాలు వస్తాయనుకుంటున్నామని, వారందరినీ తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు
చేయబోతున్నామని వివరించారు. హజ్ యాత్రికుల్లో రూ. 3 లక్షల ఆదాయం ఉన్నవారికి
రూ. 60 వేలు, అంతకుపైబడి ఆదాయం ఉన్నవారికి రూ. 30 వేలు చొప్పున హాజీలకు
బహుమతిగా అందించడం జరుగుతుందని తెలిపారు.
ఈ ఏడాది కూడా ఆ పథకాన్ని కొనసాగించనున్నట్లు చెప్పడానికి సంతోషిస్తున్నామని
తెలిపారు. హాజీలకు ఉన్న గొప్ప అవకాశం ఏంటంటే దేశంలోని ఏ రాష్ట్రం వారైనా, ఏ
రాష్ట్రం నుంచైనా హజ్ యాత్రకు వెళ్లే అవకాశం ఉందని తెలిపారు. అయితే
ఆంధ్రప్రదేశ్ హాజీలు విజయవాడ విమానాశ్రయం నుంచి వెళితే వారికి అన్ని సౌకర్యాలు
కల్పించడానికి అవకాశం ఉంటుందని, ప్రభుత్వం అందించే బహుమతులు తీసుకోవచ్చని
వివరించారు. ఇక్కడి నుంచే మక్కా కూడా పంపాలని భావిస్తున్నామని, మక్కా,
మదీనాలలో తమ తరఫున మెడికల్ క్యాంపులు నిర్వహిస్తామని తెలిపారు.
హాజీలకు అన్ని రకాల సదుపాయాలు కల్పించడం జరుగుతుందన్నారు.విజయవాడ అంబారిగేషన్
పాయింట్ నుంచి హజ్ వెళ్లే యాత్రికులను మానిటరింగ్, ట్రాకింగ్ చేయడానికి వీలుగా
ఉంటుందన్నారు. ఒకవేళ హైదరాబాద్, బెంగళూరు నుంచి వెళితే ఆయా రాష్ట్ర
ప్రభుత్వాలతో సమన్వయం చేసుకోవాల్సిన పని ఉంటుందని, అలా కాకుండా విజయవాడ నుంచి
అంబారిగేషన్ పాయింట్ ఏర్పాటు చేసినందున ఇక్కడి నుంచే వెళ్లే అవకాశం ఉన్నందున
సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించి నవరత్నాల పథకం కింద చేర్చి రూ. 3
లక్షలలోపు ఆదాయం ఉన్నవారికి రూ. 60 వేలు, ఆపై ఆదాయం ఉన్నవారికి రూ. 30 వేలు
అందించడం జరుగుతోందని వివరించారు. మన రాష్ట్రం నుంచి వెళ్లేవారికి మెడికల్
పరంగా, ప్రభుత్వ ఉద్యోగులను వాలంటీర్లను ఏర్పాటు చేసి, సేవలందించడానికి వీలు
ఉంటుందని పేర్కొన్నారు. మక్కాకు వెళ్లేవారు, ముస్లిం సోదరులు, ఉచితంగా
సేవలందించే 20 నుంచి 22 హజ్ సొసైటీలు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని విజ్ఞప్తి
చేశారు. సమావేశంలో పలువురు మైనారిటీ సంఘాల నాయకులు, హజ్ కమిటీ సభ్యులు
పాల్గొన్నారు.