విజయవాడ : సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయం మూడు ప్రధాన సూత్రాలుగా
రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం పాలన కొనసాగుతోందని ప్లానింగ్
బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. బుధవారం 58
వ డివిజన్ 259 వ వార్డు సచివాలయ పరిధిలో నగర డిప్యూటీ మేయర్ అవుతు
శ్రీశైలజారెడ్డితో కలిసి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు.
అజిత్ సింగ్ నగర్లోని షాదీఖానా వద్ద నుంచి పాదయాత్ర ప్రారంభించి సెయింట్ ఆన్స్
స్కూల్ పరిసర ప్రాంతాలలో విస్తృతంగా పర్యటించారు. 163 గడపలను సందర్శించి
గ్రీవెన్స్ స్వీకరించారు. సీఎం జగన్ పాలనలో ప్రజలకు చేసినది ధైర్యంగా పుస్తక
రూపంలో వివరిస్తున్నట్లు మల్లాది విష్ణు వెల్లడించారు. గత మూడున్నరేళ్లలో
సచివాలయ పరిధిలో రూ. 4.25 కోట్ల సంక్షేమాన్ని అందజేసినట్లు తెలిపారు.
నిజమైన సాధికారత దిశగా అడుగులు
రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల ప్రజలు తల ఎత్తుకొని
జీవించేలా సామాజిక విప్లవం వైపు వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు
వేస్తోందని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణు అన్నారు. పదేళ్లలో
సాకారం అవుతుందనుకున్న సాధికారత సీఎం వైఎస్ జగన్ తీసుకు వచ్చిన సంస్కరణలు,
పథకాలు, ఆలోచన విధానాలతో మూడున్నరేళ్లలోనే చేసి చూపించారన్నారు. అంబేద్కర్
భావజాలంతో దేశంలో బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్న
ముఖ్యమంత్రిగా అనతికాలంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరూపించుకున్నారన్నారు.
సామాజిక న్యాయానికి ప్రతిబింబం సీఎం వైఎస్ జగన్
సామాజిక న్యాయం అమలులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దేశానికే రోల్
మోడల్ గా నిలిచారని మల్లాది విష్ణు అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మొత్తం 36 ఎమ్మెల్సీ స్థానాలకు గానూ 25
స్థానాలలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకే అవకాశం కల్పించడం జరిగిందన్నారు.
తాజాగా ప్రకటించిన 18 స్దానాలలోనూ 14 స్థానాలు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు
ఇచ్చినట్లు తెలిపారు. కేబినెట్ కూర్పులోనూ ఐదుగురు ఉప ముఖ్యమంత్రులలో నలుగురు
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలే ఉన్నట్లు వెల్లడించారు. రాజ్యసభ స్దానాలలోనూ
నాలుగు స్ధానాలను బీసీలకు ఇచ్చినట్లు పేర్కొన్నారు. 13 మంది జడ్పీ ఛైర్మన్ లలో
9 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల వారే ఉన్నారన్నారు. నగర మేయర్లుగా
14 మంది ఉంటే అందులో 86 శాతం మందిని.. 87 మంది మున్సిపల్ ఛైర్మన్ లలో 73 శాతం
మందిని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల వారినే ఎంపిక చేసినట్లు
వివరించారు. వైఎస్సార్ సీపీ గెలుపొందిన 637 మండలాలలో 431 మంది ఎంపీపీలను బీసీ,
ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకే ఇచ్చినట్లు మల్లాది విష్ణు చెప్పుకొచ్చారు. కనుకనే
2024లోనూ మరలా వైఎస్ జగన్మోహన్ రెడ్డినే తమ ముఖ్యమంత్రి కావాలని ప్రజలందరూ
ముక్తకంఠంతో కోరుకుంటున్నట్లు తెలిపారు.