శ్రీకాకుళం : దేశంలోనే ఎక్కడా లేని విధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు
పరిపాలనలో పెద్ద ఎత్తున భాగస్వామ్యం కల్పించిన ఘనత సీఎం వైఎస్ జగన్ మోహన్
రెడ్డికే దక్కుతుందని మాజీ డిప్యూటీ సీఎం, జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన
కృష్ణదాస్ అన్నారు. ఎమ్మెల్సీగా నర్తు రామారావు నామినేషన్ వేస్తున్న సందర్భంగా
జిల్లా పార్టీ కార్యాలయంలో బుధవారం ఉదయం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
శాసన మండలిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు సంబంధించి జగన్ కల్పిస్తున్న
ప్రాధాన్యత ఆయా వర్గాల అభివృధ్ది పట్ల ఉన్న చిత్తశుధ్దిని, దూరదృష్టిని
తెలియచేస్తోందనీ వివరించారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నుంచి యాదవ సామాజిక
వర్గానికి చెందిన నర్తు రామారావుకు ఎమ్మెల్సీ పదవిని అంతకు ముందు చేసిన
వాగ్దానం ప్రకారం ఇవ్వడం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. జిల్లాలో యాదవ సామాజిక
వర్గం నాలుగవ పెద్ద సామాజిక వర్గమని వారి ప్రతినిధిగా జిల్లా నుంచి చట్టసభల్లో
ప్రాధాన్యత దక్కడం పెద్ద గౌరవమని పేర్కొన్నారు. తదుపరి అవకాశం కళింగ వైశ్యులకు
దక్కుతుందని, అలాగే అన్ని కులాలకు సరైన సమయంలో సరైన అవకాశం లభిస్తుందని
కృష్ణదాస్ చెప్పారు. విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, రాజాం
ఎమ్మెల్యే కంబాల జోగులు, కలింగ కోమటి కార్పొరేషన్ చైర్మన్ అందవరపు సూరిబాబు,
డిసిసిబి చైర్మన్ కరిమి రాజేశ్వరరావు, చిరంజీవి నాగ్, ఎంపీపీ వాన గోపి, చింతు
రామారావు, అంబటి శ్రీనివాసరావు, పాల వసంత రెడ్డి, రాజాపు అప్పన్న
తదితరులన్నారు.