విజయవాడ : సామాజిక న్యాయం అమలులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి
దేశానికే రోల్ మోడల్ గా నిలిచారని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్,
సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. మంగళవారం 58 వ డివిజన్ 259 వ
వార్డు సచివాలయ పరిధిలో నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, డిప్యూటీ
మేయర్ అవుతు శ్రీ శైలజారెడ్డితో కలిసి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం
నిర్వహించారు. కృష్ణ హోటల్ సెంటర్ నుంచి పాదయాత్ర ప్రారంభించి శుభోదయ స్కూల్
రోడ్డు వరకు కొనసాగించారు. 170 గడపలను సందర్శించి ముఖ్యమంత్రి జగన్మోహన్
రెడ్డి జనరంజక, అవినీతిరహిత పాలన గురించి ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగారు.
ఏపీలో అమలవుతున్న బృహత్తర కార్యక్రమాలు దేశంలోని ఏ ఒక్క రాష్ట్రంలోనూ అమలు
కావడం లేదని మల్లాది విష్ణు పేర్కొన్నారు. సచివాలయాల వ్యవస్థ ఏర్పాటు ద్వారా
సంక్షేమ పథకాలను చిట్టచివరి వ్యక్తి వరకు అందజేస్తున్న ఘనత సీఎం వైఎస్ జగన్ కే
దక్కుతుందన్నారు. పేదరిక నిర్మూలనే ధ్యేయంగా అడుగులు వేస్తూ ప్రతి ఒక్కరికీ
ఉచిత విద్య, వైద్యం, గృహ సదుపాయం కల్పిస్తున్నారన్నారు. సెంట్రల్ ప్రజలకు
మెరుగైన వైద్యం అందించడంలో భాగంగా 4 అర్బన్ హెల్త్ సెంటర్లను ఒక్కొక్కటి రూ.
80 లక్షల వ్యయంతో నిర్మించుకున్నట్లు మల్లాది విష్ణు తెలిపారు. అయోధ్యనగర్
లోని హెల్త్ సెంటర్ ను ఇప్పటికే ప్రారంభించుకోగా ఇందిరా నాయక్ నగర్లోని ఆరోగ్య
కేంద్రాన్ని ఈనెల 23న హోం మంత్రి చేతులమీదుగా ప్రారంభించుకోనున్నట్లు
వెల్లడించారు.
సామాజిక న్యాయం చేతల్లో చూపిన సీఎం జగన్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో సామాజిక విప్లవం
కొనసాగుతోందని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణు అన్నారు.
మంత్రివర్గం కూర్పు నుంచి నామినేటెడ్ పదవుల వరకు పరిపాలనలో ఎస్సీ, ఎస్టీ,
బీసీ, మైనార్టీలకు పెద్ద పీట వేయడం ద్వారా జాతీయ స్థాయిలో అందరి దృష్టిని
ఆకర్షించారన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నడూ లేని విధంగా బీసీ, ఎస్సీ,
ఎస్టీ, కాపు, మైనారిటీలకు ఐదు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చి సామాజిక న్యాయాన్ని
సీఎం జగన్ చేతల్లో చూపారన్నారు. మరలా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలోనూ సామాజిక
న్యాయం పాటించి మరోసారి చారిత్రాత్మక ప్రకటన చేశారన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్
పార్టీ ప్రకటించిన 18 మంది అభ్యర్థులలో 14 మంది బీసీ, ఎస్టీ, ఎస్సీ సామాజిక
వర్గాలకు చెందిన నేతలు ఉండటమే ఇందుకు నిదర్శనమన్నారు. గత మూడున్నరేళ్లుగా
ముఖ్యమంత్రి జగన్ అమలు చేస్తున్న సామాజిక న్యాయాన్ని మేధావులు సైతం
కీర్తిస్తున్నారని మల్లాది విష్ణు పేర్కొన్నారు. పార్టీలకతీతంగా అన్ని వర్గాల
అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేస్తోన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అండగా
నిలవాలని ఈ సందర్భంగా కోరారు.