విజయవాడ : ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా పనిచేసిన బిశ్వభూషణ్ హరిచందన్ కు ఏపీ
ప్రభుత్వం అధికారిక వీడ్కోలు పలికింది. మంగళవారం విజయవాడలో నిర్వహించిన
కార్యక్రమంలో ఘనంగా సన్మానించింది. హరిచందన్ కు శాలువా కప్పి సీఎం వైఎస్ జగన్
సత్కరించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ఆంధ్ర ప్రజలు, ప్రభుత్వం, తన తరపున
అభినందనలతోపాటు ధన్యవాదాలు తెలిపారు.
చత్తీస్ గఢ్ గవర్నర్ గా వెళ్తున్నందుకు బిశ్వభూషణ్ హరిచందన్ కు అభినందనలు.
ఆత్మీయుడైన పెద్దమనిషిగా, గవర్నర్ గా వ్యవస్థకు నిండుతనం తీసుకొచ్చినందుకు
ధన్యవాదాలన్నారు. రాజ్యాంగ వ్యవస్థల మధ్య సమన్వయం ఎలా ఉండాలన్నది ఈ మూడేళ్లలో
ఆచరణలో గవర్నర్ గొప్పగా చూపించారని జగన్ కొనియాడారు. గవర్నర్లకు, రాష్ట్రాలకు
మధ్య ఉన్న సంబంధాలపై ఈ మధ్య వార్తలు చూస్తున్నామని, కానీ మన రాష్ట్రంలో అందుకు
భిన్నంగా తండ్రిలా, పెద్దలా రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ప్రభుత్వానికి
సంపూర్ణంగా సహకరిస్తూ, వాత్సల్యం చూపించారని కొనియాడారు. ‘‘హరిచందన్ ఉన్నత
విద్యావేత్త, న్యాయ నిపుణుడు మాత్రమే కాదు. స్వాతంత్ర్య సమర యోధుడు కూడా.
నాలుగు సార్లు మంత్రిగా పనిచేశారు. తాను చేపట్టిన ప్రతి శాఖలోనూ తనదైన ముద్ర
చూపారు. 5 సార్లు ఒడిశా అసెంబ్లీకి ఎన్నికయ్యారని చెప్పారు.
గవర్నర్ హరిచందన్ మాట్లాడుతూ రాష్ట్రంలో తాను మూడేళ్ల 7 నెలలపాటు ఉన్నానని
చెప్పారు. ఏపీ తనకు ఎంతో ఆత్మీయతను ఇచ్చిందని, రాష్ట్రాన్ని వదిలి
వెళ్తున్నందుకు బాధగా ఉందన్నారు. జగన్ తనపై చూపించిన ప్రేమాభిమానాలను ఎప్పటికీ
మరిచిపోలేనని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ తన రెండో ఇల్లు అని, జగన్ తనను కుటుంబ
సభ్యుడిలా అభిమానించారని అన్నారు. తనకు మరొక టాస్క్ ఇచ్చారని, ఇక చత్తీస్ గఢ్
కు వెళ్లాల్సి ఉందని చెప్పారు.