పోలాకి : మా నమ్మకం నువ్వే జగనన్న అంటూ రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రిని తమ
గుండెల్లో పెట్టు కుంటున్నారనీ మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్ఆర్సీపీ జిల్లా
అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. మంగళవారం పోలాకిలో జేసిఎస్ సచివాలయాల
కన్వీనర్లు, గృహ సారథులతో శిక్షణా కార్యక్రమాన్ని కృష్ణదాస్ ప్రారంభించారు. ఈ
సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా అర్హతే ప్రామాణికంగా,
రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. ప్రజలకు వైఎస్ఆర్సిపి
కు మధ్య వారధిగా గృహ సారధులు సైనికుల్లా పని చేయాలనీ, వచ్చే ఎన్నికల్లో సీఎం
జగన్మోహన్ రెడ్డి గెలుపునకు వారు కృషి చేయాలన్నారు. ఇంటింటికి వెళ్లి
ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు పూర్తి అవగాహన
కల్పించాలన్నారు. పథకాలు అందని ఏ ఒక్క అర్హునికీ నష్టం జరగ కూడదని చెప్పారు.
శాసనమండలి సభ్యుల ఎంపికలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సామాజిక
సమతూకాన్ని మరోసారి పాటించి, బీసీలంటే బ్యాక్బర్డ్ క్లాస్ కాదని, బ్యాక్ బోన్
క్లాస్ అని నిరూపించారన్నారు. నర్తు రామారావును ఎమ్మెల్సీ అభ్యర్ధిగా ఎంపిక
చేయడం వల్ల యాదవ సామాజిక వర్గానికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్లయిందని
వివరించారు. ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా పార్టీ ప్రకటించిన
సీతంరాజు సుధాకర్ గెలుపునకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని, విశాఖ రాజధాని
ఆకాంక్షను తమ ఓటు ద్వారా బలంగా చెప్పాలనీ పిలుపునిచ్చారు.
పాదయాత్ర కాదు టీడీపీ పాడి యాత్ర : కృష్ణ చైతన్య
రాష్ట్రంలో చంద్రబాబు తనయుడు లోకేష్ చేస్తున్న పాదయాత్ర టీడీపీ పాడి యాత్రగా
మారిందని యువ నాయకులు, పోలాకి జెడ్పీటీసీ డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య
అన్నారు. గృహ సారథులు శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు
కావాలన్న ప్రతీ ఇంటికి ‘ నువ్వే మా నమ్మకం జగన్ ‘ అని ఉన్న స్టిక్కర్
అతికించాలని, పథకాలు వద్దనే వారి నుంచి లిఖిత పూర్వక వినతి తీసుకోవాలని
స్పష్టం చేశారు. పార్టీల కతీతంగా జగనన్న సంక్షేమ పథకాలు అందించాలనే లక్ష్యంతో
ప్రభుత్వం పని చేస్తుంటే కావాలనే దుస్ప్రచారం చేసే వారి నుంచి పథకాలు వద్దనే
హామీ తీసుకోవడంలో తప్పేమీ లేదని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో డీసీసీబీ
చైర్మన్ కరిమి రాజేశ్వరరావు, మండల పరిషత్ ప్రత్యేక ఆహ్వనితులు ముద్దాడ బైరాగి
నాయుడు, కణితి కృష్ణారావు, చింతాడ ఉమా మహేశ్వరరావు, చింతాడ వెంకట రావు,
ముద్దాడ మురళీ నాయుడు, కోట అప్పారావు, కలగదండు పాపారావు, కణితి సత్తి బాబు,
పలువురు ఎంపీటీసీ, గృహ సారథులు తదితరులు తదితరులు పాల్గొన్నారు.