గుంటూరు : జనసేన పార్టీ కోసం క్షేత్రస్థాయిలో అహర్నిశలు కష్టపడి పనిచేసే
కార్యకర్తల కుటుంబాలు ఆపదలో ఉంటే వారికి అండగా నిలబడాలనే సదుద్దేశంతో
అధ్యక్షులు పవన్ కళ్యాణ్ క్రియాశీలక సభ్యత్వం కార్యక్రమాన్ని తీసుకొచ్చారని
జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు.
దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని,
బాధిత కుటుంబానికి 90 రోజుల్లోనే బీమా సాయం అందేలా చర్యలు తీసుకుంటున్నామని
అన్నారు. పవన్ కళ్యాణ్ ఆశయ సాధన కోసం క్షేత్రస్థాయిలో దాదాపు 8,020 మంది
వాలంటీర్లు కష్టపడటం అభినందించదగ్గ విషయమని కొనియాడారు. జనసేన పార్టీ మూడో
విడత క్రియాశీలక సభ్వత్వ నమోదు కార్యక్రమం మొదలై 10 రోజులు పూర్తయిన సందర్భంగా
హైదరాబాద్ కేంద్ర కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నాదెండ్ల
మనోహర్ మాట్లాడుతూ “జనసేన పార్టీ మూడో విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు
కార్యక్రమం పండగలా జరగడం, ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాలుపంచుకోవడం
అభినందనీయం. ఈ నెల 10వ తేదీన ప్రారంభమైన ఈ కార్యక్రమం ఈ రోజుకు 10 రోజులు
పూర్తి చేసుకుంది. చిన్నపాటి సాంకేతిక సమస్యలు తలెత్తినా కార్యక్రమాన్ని అందరూ
కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్లారు. పుట్టెడు దుఃఖంలోనూ ఆ తండ్రి వాలంటీర్
అయ్యాడు. పొన్నూరుకు చెందిన సాయిభరత్ అనే క్రియాశీలక కార్యకర్త ఇటీవల
ప్రమాదవశాత్తు మరణించాడు. ఆ కుటుంబానికి పార్టీ తరఫున రూ. 5 లక్షల పరిహారం
చెక్ ఇవ్వడానికి నేనే స్వయంగా వెళ్లాను. ఆ కుటుంబాన్ని ఓదార్చి, అండగా ఉంటామని
హామీ ఇచ్చాము. ఆ తల్లిదండ్రులు పుట్టెడు దుఃఖంలో ఉండి కూడా పవన్ కళ్యాణ్
పిలుపు మేరకు మూడో విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగమయ్యారు. ఆ
యువకుడి తండ్రి వాలంటీర్ గా మారి చాలా మంది సభ్యత్వం నమోదు చేసుకునేలా
చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానంతో ఒక ఆటో డ్రైవర్, ఒక లారీ
డ్రైవర్, చదువుకునే కుర్రాడు, ఓ ఉద్యోగి ఇలా చాలా మంది వాలంటీర్లగా మారి
అధ్యక్షులవారి ఆశయ సాధన కోసం పని చేస్తున్నారు. వాళ్లంత మనందరికీ ప్రేరణగా
నిలబడుతున్నారు.
క్రియాశీలక సభ్యత్వం అందరికీ మంచి అవకాశం
క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం యువతకు మంచి అవకాశం. రేపొద్దున్న
సర్పంచుగానో, ఎంపీటీసీగానో, శాసనసభ్యుడిగా పోటీ చేయాలనుకునే యువతకు ఇది
ఉపయోగపడుతుంది. పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పాల్గొనేలా చేస్తుంది.
మూడో విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంపై పార్టీ అధ్యక్షులు పవన్
కళ్యాణ్ 22వ తేదీన సమీక్షిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నాయకులతో
టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తారని తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ అధ్యక్షుల వారి
రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్, పార్టీ ఐటీ సెల్ చైర్మన్ మిరియాల
శ్రీనివాస్ పాల్గొన్నారు.