అమరావతి : అమెరికా జనాభాలో ఒక శాతమే ఉన్నా 6 శాతం పన్నులు చెల్లించేది
భారతీయులేనాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రథాన కార్యదర్శి, రాజ్యసభ
సభ్యుల విజయసాయిరెడ్డి అన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటనను విడుదల
చేశారు. ఏటా పాశ్చాత్య దేశాల్లో, ఇతర అభివృద్ధి చెందిన దేశాల్లో ఉద్యోగాలు,
వ్యాపారాలు చేయడానికి పయనమయ్యే వారి సంఖ్య ఇండియా నుంచి పెరిగిపోతోందని
చెప్పారు. ఇలా యువతీయువకులైన నిపుణులు, ఉన్నత విద్య అభ్యసించాలనుకునే
విద్యార్థులు అమెరికా, కెనడా వంటి అమెరికా ఖండ దేశాలకు, ఇంగ్లండ్, జర్మనీ,
ఫ్రాన్స్ వంటి ఐరోపా దేశాలకు వెళ్తున్నారని అన్నారు. చదువు, ఉపాధి కోసం దేశ
ప్రజలు ఇతర సంపన్న దేశాలకు వలసపోవడం భారతదేశానికి ప్రయోజనకరమేగాని గతంలో
పొరపాటున భావించినట్టు నష్టదాయకం ఆయితే కాదాని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ప్రపంచంలో అన్ని రంగాల్లో ఎనలేని ప్రగతి సాధించిన అమెరికాలో భారత సంతతి ప్రజల
పాత్ర అత్యంత కీలకంగా మారిన విషయం తెలిసిందేనన్నారు. గత పాతికేళ్లుగా ఇండియా
నుంచి ముఖ్యంగా తెలుగు ప్రాంతాల నుంచి విద్యార్థులుగా అమెరికా వెళ్లి
ఉద్యోగులుగా అక్కడ స్థిరపడుతున్న యువతీయువకుల సంఖ్య గణనీయంగా
పెరిగిపోతోందన్నారు. వారికే కొన్నాళ్లకు గ్రీన్ కార్డులు, తర్వాత అమెరికా
పౌరసత్వం లభిస్తున్నాయని చెప్పారు. 1965 నుంచీ ఇలా అమెరికా వెళ్లిన డాక్లర్లు,
ఇంజనీర్లు ఇతర వృత్తినిపుణల సంఖ్య ఇప్పటికి శరవేగంతో పెరిగిపోవడంతో అమెరికాలో
భారతీయ–అమెరికన్ల జనాభా ఒక శాతానికి చేరుకుందని వెల్లడించారు. అమెరికా జనాభాలో
భారత సంతతి జనం 42 లక్షల వరకూ ఉంటారని అంచనా. ఇతర జాతుల అమెరికన్ల తలసరి
ఆదాయంతో పోల్చితే భారతీయుల ఆదాయం చాలా ఎక్కువగా వుందన్నారు.ఇతర ఆసియా దేశాల
నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడిన వారితో పోల్చి చూస్తే–ఇండియన్లు అత్యధిక
ఆదాయం, వేతనాలు వచ్చే నైపుణ్యమున్న ఉద్యోగాలు, వ్యాపారాల్లో ఉండడమే దీనికి
కారణామని చెప్పారు. పైన వివరించినట్టు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఒక
శాతానికి కాస్త ఎక్కువ ఉన్న భారత సంతతి ప్రజలు అక్కడి ప్రభుత్వాలకు వసూలయ్యే
పన్నుల మొత్తంలో 6 శాతం చెల్లిస్తున్నారంటే వారు ఎంతటి అభివృద్ధి సాధించారో
అర్ధం చేసుకోవచ్చన్నారు. ఈ విషయాన్ని ఇటీవల అమెరికాలోని జార్జియా రాష్ట్రానికి
చెందిన అమెరికా (కాంగ్రెస్‌లోని దిగువసభ) ప్రతినిధుల సభ సభ్యుడు రిచ్మండ్
మెక్ కార్మిక్ వెల్లడించారి చెప్పారు. ‘వారు (భారతీయులు) అమెరికా సమాజంలో ఒక
శాతం మాత్రమే ఉన్నప్పటికీ, ఆరు శాతం పన్నులు చెల్లిస్తున్నారు. ఇండియన్ల
ఉత్పాదక శక్తి అత్యధికం. వారు సమస్యలు సృష్టించరు. చట్టాలకు విధేయులై ఉంటారు,’
అని మెక్ కార్మిక్ ప్రశంసించారని వెల్లడించారు. ఇటీవల అంటే–21వ శతాబ్దం
మొదటి పాతికేళ్లలో భారతీయులు విద్యార్థులుగా విదేశాలకు వెళ్లి ఉద్యోగులుగా
పాశ్చాత్య దేశాల్లో స్థిరపడడం వల్లే వారు ఊహించలేనంత ఎక్కువగా ప్రగతి
సాధిస్తున్నారని కొనియాడారు. 2022లో ఇండియా నుంచి ఏడున్నర లక్షల మంది
విద్యార్థులు 150 దేశాల్లోని యూనివర్సిటీల్లో చదవడానికి వెళ్లారని చెప్పారు.