విజయవాడ : విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రసాదరెడ్డి తీరుపై
టీడీపీ నేతలు మండిపడుతున్నారు. వీసీ ప్రసాదరెడ్డి ఏయూ క్యాంపస్ లో రాజకీయ
సమావేశాలు నిర్వహిస్తున్నారంటూ టీడీపీ నేతలు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి
ఫిర్యాదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వీసీ రాజకీయ సమావేశాల్లో
పాల్గొంటున్నారని నక్కా ఆనంద్ బాబు, అశోక్ బాబు ఎన్నికల సంఘానికి తెలిపారు. ఈ
మేరకు చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ముఖేశ్ కుమార్ మీనాకు టీడీపీ నేతలు వినతిపత్రం
అందజేశారు. వీసీ ప్రసాదరెడ్డి ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ వైసీపీ
అభ్యర్థి సీతంరాజు సుధాకర్ కు మద్దతుగా సమావేశం ఏర్పాటు చేసినట్టు కథనాలు
వచ్చాయి. ఈ సమావేశానికి రావాలంటూ ప్రైవేటు డిగ్రీ, పీజీ కాలేజీల యాజమాన్యాలకు
నాలుగు రోజుల కిందటే ఆహ్వానాలు వెళ్లినట్టు తెలుస్తోంది. వీసీ ప్రసాదరెడ్డిపై
గతంలోనూ ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా వర్సిటీలో
కేకులు కట్ చేయడం, ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారని విపక్షాలు
మండిపడ్డాయి.