విశాఖపట్నం : సింహాచలం శ్రీ వరాహాలక్ష్మీనృసింహస్వామి అత్యంత మహిమాన్వితులని
కంచి పీఠాధిపతి శంకర విజయేంద్రసరస్వతి స్వామి పేర్కొన్నారు. శంకరమఠంలో విడిది
చేసియున్న స్వామిని సోమవారం సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు,
వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు మర్యాదపూర్వకంగా
కలుసుకొని సింహాద్రినాధుడు జ్ఞాపికను బహుకరించారు. ఈ సందర్భంగా విజయేంద్ర
సరస్వతి పలు అంశాలు వెల్లడించారు. 1988 తరువాత తాను ఇటీవలే సింహాచలం ఆలయాన్ని
సందర్శించి సింహాద్రినాధుడిని దర్శించుకోవడం జరిగిందన్నారు. ఆలయంలో శాసనాలను
తాను నిశితంగా పరిశీలించానన్నారు. వేద పాఠశాల, గోశాల నిర్వహణ మెరుగ్గా
ఉన్నాయని అయితే మరింతగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని స్వామి
అభిప్రాయపడ్డారు. అక్షర తృతియ, చందనోత్సవం నేపధ్యంలో సింహాచలం దేవస్థానంలో
వెయ్యి మందితో నృసింహ కరావలంబస్తోత్రం , నృసింహ పంచరత్నం, లక్ష్మీఅష్టకం,
నిత్యపారాయణ శ్లోకాలు, మైత్రీ పూజిత మంగళ శ్లోకాలు , రామచంద్రాయ జనక శ్లోకాలు
ఆలపిస్తారన్నారు. ఇందు కోసం తమ పరివారానికి అవసరమైన మేరకు సూచనలు చేసినట్లు
శంకర విజయేంద్ర సరస్వతి స్వామి శ్రీనుబాబుకు వివరించారు. ఇందు కోసం వెయ్యి
మందికి శిక్షణ ఇచ్చి సిద్దం చేస్తారన్నారు. శంకరమఠంలో ప్రతీ రోజు విశేషంగా
అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, సింహాచలం ఆలయ అభివృద్ధిలో
ధర్మకర్తలుగా పూర్తి స్థాయిలో సేవలందించి భక్తులు మన్ననలు పొందాలని స్వామి
శ్రీనుబాబుకు సూచించారు.