విజయవాడ : ప్రతి ఒక్కరూ సందర్భం వచ్చినప్పుడు పుస్తకాలను సేకరించి ప్రతి
ఇంటిలో మినీ లైబ్రరీ ని ఏర్పాటు చేసుకోవాలని ఎస్సీ,ఎస్టీ ఎంప్లాయిస్
అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు దేవరపల్లి సురేష్ బాబు సూచించారు. విజయవాడలో
ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జరుగుతున్న 33వ పుస్తక మహోత్సవ ముగింపు
కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ ప్రతి
ఒక్కరూ మొబైల్ ఫోన్లలో అనవసరంగా గంటల కొద్దీ సమయాన్ని వృధా చేస్తున్నారని
దానికి ప్రత్యామ్నాయంగా పుస్తక పఠనం అలవర్చుకోవాలని తెలిపారు. పిల్లలకు ముఖ్య
దినోత్సవాల సందర్భంగా పుస్తకాలను కానుకలుగా ఇవ్వాలని తల్లిదండ్రులను కోరారు.
పుస్తక పఠనం ద్వారా మూఢనమ్మకాలు,అపోహలు తొలగి సమాచార నైపుణ్యం అలవర్చుకొని
జ్ఞానవంతులవుతారని అన్నారు. పుస్తక మహోత్సవంలో ఏర్పాటు చేసిన వివిధ స్టాల్
లను సందర్శించి పుస్తకాలను కొనుగోలు చేశారు. 33 సంవత్సరాలుగా నిర్విరామంగా
పుస్తక మహోత్సవాలు జరుపుతున్న నిర్వాహకులను అభినందించారు.