విజయవాడ : మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని ఈ నెల 21వ తేదీ
వరకు శ్రీ కన్యకాపరమేశ్వరి అన్నసత్రం కమిటీ ఆధ్వర్యంలో
బ్రహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు కమిటీ అధ్యక్షుడు బచ్చు వెంకట
లక్ష్మివరప్రసాద్ తెలిపారు. ఈ విషయమై బ్రాహ్మణ వీధిలోని శ్రీ
కన్యకాపరమేశ్వరి అన్నసత్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో
వివరాలు వెల్లడించారు. ముందుగా బ్రహ్మోత్సవాలు, రథోత్సవానికి సంబంధించిన
కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం బచ్చు వెంకట లక్ష్మివరప్రసాద్
మాట్లాడుతూ, మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నిర్వహిస్తున్న
బ్రహ్మోత్సవాల్లో భాగంగా పాత శివాలయంలో వేంచేసి ఉన్న శ్రీ భ్రమరాంబ
మల్లేశ్వర స్వామివార్లకు, శ్రీ భద్రకాళీ సమేత వీరభద్ర స్వామివార్లకు
, బుద్దువారి శివాలయంలో వేంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతీ సమేత వసంత
మల్లిఖార్జున స్వామివార్లకు బ్రహ్మోత్సవాలు, కళ్యాణరథ, పుష్ప
యాగోత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. 18న శనివారం రాత్రి 12గంటలకు
స్వామివర్లకు కళ్యాణ మహోత్సవం జరుపుతామన్నారు. అదేవిధంగా 19న ఆదివారం
సాయంత్రం 5గంటలకు కెనాల్ రోడ్డులో శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామి, శ్రీ
భద్రకాళీ సమేత వీరభద్ర స్వామి, శ్రీ గంగా పార్వతీ సమేత వసంత
మల్లిఖార్జున స్వామి ఉత్సవమూర్తులతో అంగరంగ వైభవంగా రథోత్సవాన్ని
అత్యంత కనుల పండుగగా నిర్వహిస్తూ ఊరేగింపు నిర్వహిస్తామని తెలిపారు.
రథోత్సవాన్ని నగర పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా ముఖ్య అతిథిగా
పాల్గొని ప్రారంభిస్తారని చెప్పారు. అలాగే రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు
సత్యనారాయణ, మాజీ మంత్రి, పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు,
విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్(నాని), ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు,
గద్దే రామ్మోహన్రావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, దుర్గగుడి ఈవో
దర్భముళ్ళ భ్రమరాంబ తదితరులు విశిష్ట అతిథులుగా విచ్చేస్తారని
పేర్కొన్నారు. గడచిన 153 సంవత్సరాలుగా శ్రీ కన్యకాపరమేశ్వరి
అన్నసత్రం కమిటీ ఆధ్వర్యంలో రథోత్సవాన్ని విద్యుత్తు దీపాలు, కోలాటాలు,
నృత్యాలు, భక్తుల శివనామ స్మరణ నడుమ అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్లు
బచ్చు వెంకట లక్మివరప్రసాద్ వెల్లడించారు. విలేకరుల సమావేశంలో
అన్నసత్రం కమిటీ ప్రధాన కార్యదర్శి బయన శ్రీరాజేష్, ప్రధమ
ఉపాధ్యక్షులు వల్లంకొండ వీరముని బ్రహ్మానందరావు, ద్వితీయ ఉపాధ్యక్షులు
వల్లంకొండ ప్రసాద్, సహాయ కార్యదర్శులు డోగుపర్తి శంకర్రావు,
బొలిశెట్టి జగన్మోహన్రావు, కోశాధికారి చల్లా హరినారాయణ, కమిటీ
సభ్యులు పాల్గొన్నారు.