అమరావతి : భారత ప్రజాస్వామ్యాన్ని భారతీయులే బలోపేతం చేసుకోగలరని బిలియనీర్
ఇన్వెస్టర్ జార్జి సొరోస్ వంటి కుబేరుల జోక్యం అవసరం లేదని రాజ్యసభ సభ్యులు,
వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అన్నారు. సామాజిక మాద్యమం
వేదికగా శుక్రవారం ఈ అంశంపై స్పందించారు. భారత బిలియనీర్ గౌతమ్ అదానీ
కంపెనీలు ఇప్పుడు చిక్కుకున్న సంక్షోభం భారతదేశంలో సంస్థాగత సంస్కరణలు
రావడానికి దోహదం చేస్తుందని ఇండియాలో ప్రజాస్వామ్యం పునరుద్ధరణకు ఈ పరిణామం
ప్రేరేపిస్తుందని భావిస్తున్నానని అన్నారు. అమెరికాకు చెందిన ఇన్వెస్టర్
జార్జి సొరోస్ అన్న మాటలు తీవ్ర అభ్యంతరకరమని అన్నారు. దేశంలో పార్లమెంటరీ
ప్రాజాస్వామ్యాన్ని, ప్రజాతంత్ర వ్యవస్థలను, రాజ్యాంగాన్ని పరిరక్షించుకునే
సత్తా భారతీయులకు ఉందని ఈ విషయంలో ఇతరుల జోక్యం, ‘సహకారం’ అవసరం లేదని
అన్నారు. తూర్పు ఐరోపా దేశం హంగరీ నుంచి అమెరికా వచ్చి స్థిరపడిన హెడ్జ్
ఫండ్ మేనేజర్, మహాదాత, షార్ట్ సెల్లర్ అయిన సొరోస్ ఈ విధంగా మాట్లాడడం
భారత అంతర్గత ప్రజాస్వామ్యంలో జోక్యం చేసుకోవడమే అవుతుందని అన్నారు. జర్మనీ
నగరం మ్యూనిక్ లో ప్రారంభమౌతున్న అంతర్జాతీయ భద్రతా సదస్సుకు ఒక రోజు ముందు
ప్రసంగిస్తూ, ‘హిండెన్‌బర్గ్ నివేదికతో అదానీ గ్రూపు కష్టాల్లో పడింది. దీని
వల్ల భారత ప్రధాని మోదీ కూడా బలహీనమయ్యే అవకాశం ఉంది, ’ అని సొరోస్ జోస్యం
చెప్పడం ఏ మాత్రం సబబు కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక అంతర్జాతీయ
ఇన్వెస్టర్ హోదాలో– హిండెన్ బర్గ్ నివేదికపైనా, అదానీ గ్రూపు కంపెనీల
తీరుతెన్నుల పైనా ఏమైనా మాట్లాడే స్వేచ్ఛ సొరోస్ కు ఉందిగాని, అదానీ
గ్రూపునకు భారత ప్రధాని మోదీకి, ఇంకా భారత ప్రజాస్వామ్యం నాణ్యతకూ ముడిపెట్టి
ఆయన మాట్లాడడం గర్హనీయం. అవాంఛనీయం అని అన్నారు. భారత వ్యాపార దిగ్గజాలు చేసే
పొరపాట్లు, నేరాలను విచారించి, వాటిని సరైన మార్గంలో పెట్టే ప్రభుత్వ,
రాజ్యాంగ వ్యవస్థలు దేశంలో సమర్ధంగా పనిచే స్తున్నాయని గుర్తుచేశారు. 1992లో
హర్షద్ మెహతా స్టాక్ కుంభకోణాన్ని, తర్వాత కేతన్ పారిఖ్ కుంభకోణాన్ని భారత
ప్రభుత్వ నియంత్రణ వ్యవస్థలు తట్టుకుని నిలబడగలిగాయి. ఇలాంటి ఆర్థిక సమస్యలు
లేదా సంక్షోభాలను ఇతర దేశాల సహకారం లేదా జోక్యం లేకుండానే ఇండియా
పరిష్కరించుకోగలిగిందని గుర్తుచేశారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థికమాద్యం కొనసాగిన
సమయంలో కూడా ఇండియా తన విస్తృత దేశీయ మార్కెట్ కారణంగా నిలబడగలిగిందని, జెట్
స్పీడ్ వేగంతో కోలుకుందని అన్నారు. ఈ క్రమంలోనే కొన్ని మాసాల క్రితం ప్రపంచ
ఐదో ఆర్థిక వ్యవస్థగా కూడా అవతరించిన విషయాన్ని గుర్తుచేశారు.