విజయవాడ : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలందరూ పూర్తి
సంతోషంగా ఉన్నారని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది
విష్ణు తెలిపారు. శుక్రవారం 58 వ డివిజన్ 258 వ వార్డు సచివాలయ పరిధిలో నగర
డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డితో కలిసి ఐదో రోజు గడప గడపకు మన
ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. పైపుల రోడ్డు, కె.ఎల్.రావు వీధి, తిలక్
రోడ్డు, శుభోదయ స్కూల్ రోడ్డులలో విస్తృతంగా పర్యటించి.. 198 గడపలను
సందర్శించారు. మూడున్నరేళ్లలో ప్రభుత్వం చేసిన మంచితో పాటు లబ్ధిదారులకు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాసిన లేఖను వివరించారు. ప్రజలకు అందించిన
సంక్షేమాన్ని బుక్ లెట్ల ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యలను
తెలుసుకుని తక్షణ పరిష్కారానికి అధికారులకు సూచనలు చేశారు. సైడ్ కాలువల్లో
నీరు పారేలా ఎప్పటికప్పుడు మురుగు తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు. కూలిన,
పగుళ్లిచ్చిన సైడ్ డ్రెయిన్ల పున: నిర్మాణానికి అంచనాలు సిద్ధం చేయవలసిందిగా
ఇంజనీరింగ్ అధికారులకు తెలిపారు. అనంతరం కుల, ఆదాయ పత్రాల కోసం విన్నవించిన
పలువురికి మంజూరైన పత్రాలను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు.
సీఎం జగన్ సర్కారుకి చంద్రబాబే నూరు శాతం మార్కులు వేశారు
దేశంలో సంక్షేమానికి సరికొత్త నిర్వచనం ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్
రెడ్డి గారని మల్లాది విష్ణు పేర్కొన్నారు. ఎందరికో అసాధ్యమైన అనేక అభ్యుదయ
పథకాలను సుసాధ్యం చేసి సంక్షేమ రథసారథిగా తెలుగు రాజకీయ యవనికపై తనకంటూ
సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నారన్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్,
జలయజ్ఞం వంటి ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆయనే ఆద్యులు అని
తెలిపారు. రైతాంగానికి ఉచిత విద్యుత్ పై ముఖ్యమంత్రిగా ఆయన చేసిన తొలిసంతకం
ఇప్పటికీ అన్నదాతల హృదయాలలో చెరగని ముద్ర వేసిందన్నారు. ఆ మహానేతను కాపీ
కొట్టి 2014 లో చంద్రబాబు చేసిన తొలి 5 సంతకాలలో చివరకు ఏ ఒక్కటీ పూర్తిగా
నెరవేర్చలేకపోయారన్నారు. కానీ వైఎస్సార్ ఆశయాలను కొనసాగిస్తూ.. 2019 కి ముందు,
తర్వాత అన్న విధంగా పరిపాలనలో సీఎం వైఎస్ జగన్ విప్లవాత్మక సంస్కరణలు
తీసుకొచ్చారన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలోచనలను అనుకరిస్తూ..
వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి చంద్రబాబే నూటికి నూరు శాతం మార్కులు
వేస్తున్నారని చెప్పుకొచ్చారు.