ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డైనమిక్ నిర్ణయాలు, పాలనాపరమైన
సంస్కరణల కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పథంలో
దూసుకుపోతోందని రాష్ట్రాన్ని సందర్శించిన అనేక ఇతర రాష్ట్రాల ప్రముఖులతో పాటు
ఇతర దేశాల ప్రముఖులు కూడా ఆయన పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారని రాజ్యసభ
సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి అన్నారు. సీఎం జగన్
సారధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంస్కరణలు, పథకాలు
నుంచి స్ఫూర్తి పొంది ఇతర రాష్ట్రాల్లోనూ ఆయా ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని
అన్నారు. ట్విట్టర్ వేదికగా గురువారం ఆయన పలు అంశాలపై తనదైన శైలిలో
స్పందించారు. ముఖ్యమంత్రి చిత్తశుద్ధి వల్లే కడప స్టీల్ ప్లాంట్ కార్యరూపం
దాల్చిందని, రాష్ట్రంలో స్పీడ్ గ్రోత్ సాధ్యపడుతోందని రాష్ట్ర
సమగ్రాబివృద్దిపై ఆయన స్పష్టమైన విధానం తో ముందుకు దూసుకుపోతున్నారని జె ఎస్
డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ కొనియాడిన విషయాన్ని గుర్తు చేశారు.
పోలవరం దిగువ కాపర్ డ్యాం పనులు పూర్తి
పోలవరం దిగువ కాపర్ డ్యాం పనులు విజయవంతంగా పూర్తయ్యాయని, దీంతో గోదావరికి ఎంత
వరద వచ్చినా ఇక ప్రజలు నిశ్చింతగా ఉండొచ్చని విజయసాయి రెడ్డి తెలిపారు. దిగువ
కాపర్ డ్యాం పనులు పూర్తవడంతో వరదల్లోనూ ఈసీఆర్ఎఫ్ (ఎర్త్ కం రాక్ ఫిల్)
డ్యామ్ పనులు చేపట్టేందుకు వీలు కలుగుతుందని అన్నారు. డయాఫ్రం వాల్ పై ఎన్
హెచ్ పీసీ (నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్) నివేదిక ఆధారంగా
ప్రభుత్వం అడుగులు వేస్తోందని అన్నారు. టీడీపీ ప్రభుత్వం నిర్వాకంతో దిగువ
కాపర్ డ్యాం 680 మీటర్ల పొడవున కోతకు గురయ్యిందని అన్నారు.
ప్రతీ రాష్ట్రంలో ప్రత్యేక కేన్సర్ ఆసుపత్రి ఏర్పాటు చేయాలి
ప్రపంచంలో క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల్లో 20 శాతం మంది
భారతదేశంలోనే ఉన్నట్లు గణాంకాలు చెబుతుండడం మిక్కిలి ఆందోళన కలిగించే అంశమని
విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న పెద్దవారికన్నా
చిన్నారులను వ్యాధి బారి నుంచి రక్షించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వైద్య
నిపుణులు చెబుతున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి దేశంలోని అన్ని
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రత్యేక క్యాన్సర్ ఆసుపత్రులు ఏర్పాటు
చేయాలని, క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న చిన్నారులను కాపాడాలని కోరారు.
ఐటీబీపీలో 9000 పోలీస్ ఉద్యోగాలు
ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ లో 7 కొత్త బెటాలియన్లకు 9000 ఉద్యోగాల
రిక్రూట్మెంట్ కు దేశ ప్రధాని నరేంద్ర మోదీ అమోదం తెలపడంతో ఆయనకు ధన్యవాదములు
తెలియజేస్తున్నానని విజయసాయి రెడ్డి తెలిపారు. ప్రధాని నిర్ణయంతో బోర్డర్
సెక్యూరిటీ బలోపేతం కావడంతో యూనిఫారం ధరించి దేశానికి సేవచేయాలన్ని యువతకు ఇదో
చక్కటి అవకాశమని ఆయన అన్నారు.