అమరావతి : రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో జరుగుతున్నసోషల్ వెల్ఫేర్,
ఎస్సీ గురుకులాలకు చెందిన నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని, వీటిపై అధికారుల
పర్యవేక్షణ మరింత పటిష్టంగా ఉండాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు
నాగార్జున అధికారులను ఆదేశించారు. సచివాలయంలో గురువారం నిర్వహించిన సమావేశంలో
సోషల్ వెల్ఫేర్, ఎస్సీ గురుకుల విద్యాలయాల సంస్థలకు సంబంధించి రాష్ట్రంలో
నిర్మాణంలో ఉన్న పనుల పురోగతిని నాగార్జున సమీక్షించారు. గురుకులాలకు
సంబంధించిన నూతన భవన నిర్మాణాలు, అదనపు తరగతి గదులు, ఇతర భవనాల నిర్మాణం,
వివిధ భవనాల నిర్వహణ మరమ్మతులకు సంబంధించి మొత్తం 507 పనులను రూ.1061 కోట్లతో
మంజూరు చేయగా వీటిలో 474 భవనాల నిర్మాణాలను ప్రారంభించగా వాటిలో 420 భవనాల
నిర్మాణాన్ని రూ.723 కోట్లతో పూర్తి చేయడం జరిగిందని తెలిపారు.
మరో 32 పనులు తుదిదశలో ఉండగా, 22 పనులు పురోగతిలో ఉన్నాయని చెప్పారు.
విద్యాలయాలకు సంబంధించిన భవనాల నిర్మాణంతో పాటుగా వాటికి సంబంధించిన ఇతర
పనులను కూడా సకాలంలో పూర్తి చేయాలని కోరారు. సోషల్ వెల్ఫేర్ కు సంబంధించి
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో చేపట్టిన అంబేద్కర్ భవనాలు, స్టెడీ సర్కిళ్ల
భవనాలు, కమ్యూనిటీ హాళ్లు, ఇంటిగ్రేటెడ్ హాస్టళ్లు తదితర భవనాలకు సంబంధించిన
నిర్మాణ ప్రగతిని నాగార్జున సమగ్రంగా సమీక్షించారు. ప్రస్తుతం సోషల్ వెల్ఫేర్,
ఎస్సీ గురుకులాలకు సంబంధించిన నిర్మాణ పనులు ఏపీఇడబ్ల్యుఐడీసీ ఆధ్వర్యంలో
జరుగుతున్న విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ, ఏపీఇడబ్ల్యుఐడీసీ ఇంజనీరింగ్
అధికారులు సాంఘిక సంక్షేమశాఖ, గురుకుల విద్యాలయాల సంస్థ అధికారులతో సమన్వయం
చేసుకొని పని చేయాలని కోరారు.
విద్యార్థుల సమస్యలు తీర్చడం కోసం కోట్ల రుపాయల వ్యయంతో మంజూరు చేసిన పనులను
పూర్తి చేయడంలో ఎక్కడా జాప్యం జరగకుండా చూసుకోవాలని చెప్పారు.
ఏపీఇడబ్ల్యుఐడీసీ అధికారులతో ఎప్పటి కప్పుడు సమీక్షా సమావేశాలను నిర్వహించడం
ద్వారా నిర్మాణ పనులు వేగవంతంమయ్యేలా చూసుకోవాలని సాంఘిక సంక్షేమశాఖ డైరెక్టర్
హర్షవర్ధన్, గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి పావనమూర్తిని ఆదేశించారు.
ఏపీఇడబ్ల్యుఐడీసీ అధికారులు సాంఘిక సంక్షేమశాఖ కు సంబంధించిన పనులపై ప్రత్యేక
శ్రద్ధ పెట్టాలని నాగార్జున కోరారు. నిర్మాణ, నిర్వహణ పనుల్లో నాణ్యత మరింత
మెరుగ్గా ఉండేలా చూసుకోవాలని, పర్యవేక్షణ మరింత పటిష్టం కావాల్సిన అవసరం ఉందని
అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో హర్షవర్ధన్, పావనమూర్తితో పాటుగా
ఏపీఇడబ్ల్యుఐడీసీ చీఫ్ ఇంజనీర్ గోపీచంద్, ఎస్ఇలు నాగేశ్వర్ రావు, నర్సింహ
మూర్తి, అడిషనల్ డైరెక్టర్ రఘురామ్, ఎస్సీ హాస్టళ్ల డీడీ లక్ష్మీసుధ తదితరులు
పాల్గొన్నారు.