విజయవాడ : రాష్ట్రంలో నిషేదిత ప్రమాణాలతో కూడిన ప్లాస్టిక్ వినియోగంను మూడు
నెలల్లో పూర్తిగా అరికట్టాలని రాష్ట్ర పర్యావరణ, శాస్త్రసాంకేతిక, ఇంధన, అటవీ,
గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. విజయవాడలోని క్యాంప్
కార్యాలయంలో ఎపి కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో బుధవారం సమీక్షా సమావేశం
నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాలుష్యాన్ని
వెదజల్లుతున్న పరిశ్రమలపై పూర్తిస్థాయి పర్యవేక్షణ కొనసాగించాలని కోరారు.
మానవాళికి హాని కలిగించేలా, పర్యావరణంకు విఘాతం ఏర్పడేలా కాలుష్యంను విడుదల
చేస్తున్న సంస్థల పట్ల కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ఆయా పరిశ్రమలు
వ్యర్థాలను నేరుగా బయటకు విడుదల చేయకుండా, వాటిని శుద్దిచేసి, హానికర
రసాయనాలను పూర్తిగా తొలగించిన తరువాతే బయటకు వదిలేలా చూడాలని కోరారు. అందుకు
అవసరమైన వేస్ట్ మేనేజ్ మెంట్ ప్లాంట్ లను పరిశ్రమలు సిద్దం చేసుకోవాలని
అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 కేటగిరిల్లోని 307 పరిశ్రమలు ఇప్పటికే ఎపి
పిసిబి పరిధిలో నిత్యం కాలుష్య నియంత్రణ ప్రమాణాలపై ఆన్ లైన్ ద్వారా సమాచారంను
అందిస్తున్నాయని తెలిపారు. దీనివల్ల ఏ పరిశ్రమలో అయినా కాలుష్యం ప్రమాణాలకు
భిన్నంగా వెలువడితే వెంటనే పిసిబి అధికారులు సదరు పరిశ్రమలను అప్రమత్తం
చేయడానికి వీలవుతోందని తెలిపారు. ఇదే విధానాన్ని అన్ని పరిశ్రమలకు
వర్తింపచేయాలని అన్నారు.
జాతీయ స్థాయిలో గ్రీన్ ట్రిబ్యునల్, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి
మార్గదర్శకాల మేరకు రాష్ట్రంలో ఎపి పిసిబి పనిచేస్తోందని అన్నారు. వివిధ
కేటగిరిల్లోని వ్యర్థాల నిర్వహణపై ఎప్పటికప్పుడు జాతీయ సంస్థలకు నివేదికలను
సమర్పిస్తున్నామని అన్నారు. గ్రీన్ ట్రిబ్యునల్ తన దృష్టికి వచ్చిన
ఫిర్యాదులపై నేరుగా స్వతంత్ర సంస్థలతో విచారణ జరిపిస్తోందని అన్నారు. కాలుష్య
నియంత్రణ మండలి సైతం టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసి, ప్రమాణాలు పాటించని
సంస్థలపై తనిఖీలను ముమ్మరంగా కొనసాగిస్తోందని అన్నారు. నేషనల్ క్లీన్ ఎయిర్
ప్రోగ్రామ్(ఎన్ క్యాప్) కింద రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో గాలి
కాలుష్యంను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. రాష్ట్ర, జోనల్,
జిల్లాస్థాయి కమిటీలను ఏర్పాటు చేసి గాలి కాలుష్యంపై పర్యవేక్షిస్తున్నామని
అన్నారు. ఐఐటి తిరుపతి, ఆంధ్రా యూనివర్సిటీ, ఎన్ఎఆర్ఎల్, సిఎస్ఐఆర్,
ఎన్ఇఇఆర్ఐ, ఐఐటి మద్రాస్ ల ద్వారా రాష్ట్రంలోని పలుచోట్ల గాలి కాలుష్యంపై
అధ్యయనం జరుగుతోందని అన్నారు. హాట్ స్పాట్ లను గుర్తించడం, కాలుష్యానికి
కారణాలను పరిశీలించి, వాటికి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకునేందుకు కృషి
చేస్తున్నామని అన్నారు. గాలి కాలుష్యాన్ని తగ్గించేందుకు ఇప్పటికే 42.90
కోట్లతో పలు నగరాలు, పట్టణాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టామని అన్నారు.
రాష్ట్రంలో బయో వ్యర్థాల నిర్వహణ సగ్రమంగా జరగాలని, బయోవేస్ట్ మేనేజ్ మెంట్
సంస్థలు ఇస్తున్న వివరాలను సమగ్రంగా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.