విజయవాడ : పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా పాలిటెక్నిక్ విద్యార్ధులను
తీర్చిదిద్దేందకు నూతన పాఠ్యాంశాలు సిద్దం చేయనున్నట్టు రాష్ట్ర
నైపుణ్యాభివృద్ది, ఐటి శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ అన్నారు. రాష్ట్ర సాంకేతిక
విద్యాశాఖ, రాష్ట్ర సాంకేతిక విద్యా, శిక్షణా మండలి సంయిక్త ఆధ్వర్యంలో
పాలిటెక్నిక్ బోధనలో నూతన పాఠ్య ప్రణాళిక ఆవశ్యకత, అమలుపై బుధవారం విజయవాడలో
ప్రత్యేక కార్యశాలను నిర్వహించారు. పరిశ్రమ ప్రతినిధులు, ఇంజనీరింగ్ కళాశాలల
విభాగాధిపతులు, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్స్, అధ్యాపకులు బృందాలుగా
ఏర్పడి పూర్తి స్దాయి చర్చ అనంతరం పలు సూచనలను సమావేశం దృష్టికి
తీసుకువచ్చారు. ఈ సందర్భంగా సౌరభ్ గౌర్ మాట్లాడుతూ వాస్తవ పరిస్ధితుల మేరకు
పాలిటెక్నిక్ విద్యార్ధులకు శిక్షణ అందించాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు.
పాలిటెక్నిక్ విద్యార్ధులకు తక్షణమే ఉపాధి లభించేలా పూర్తి స్ధాయిలో
పాఠ్యాంశాల మార్పుకు శ్రీకారం చుడుతున్నామన్నారు. పరిశ్రమకు విద్యావ్యవస్ధకు
మధ్య ఉన్న స్వల్ప అంతరాన్ని అధిగమించేలా ప్రస్తుతం మేధో మధనం
చేస్తున్నామన్నారు.
సాంకేతిక విద్యా శాఖ సంచాలకురాలు, రాష్ట్ర సాంకేతిక విద్యా, శిక్షణా మండలి
ఛైర్మన్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ అత్యధిక మార్కులు పొందిన విద్యార్ధులు సైతం
ఉద్యోగం సాధించటంలో అవాంతరాలు ఎదుర్కోవటం ఆందోళన కలిగిస్తుందన్నారు.
ఈపరిస్ధితికి గల కారణాలు వెలికి తీసి పరిష్కారం కనుగోనే ప్రయత్నంలో భాగమే
ప్రస్తుత కార్యక్రమం అన్నారు. ఈ నేపధ్యంలో పలు అంశాలు సమాలోచన దృష్టికి
వచ్చాయని నాగరాణి వివరించారు. ప్రస్తుతం 40శాతంగా ఉన్న ప్రాక్టికల్స్ ను
50శాతానికి చేయాలన్న సూచన కీలకం అన్నారు. పాఠ్య ప్రణాళిక రూప కల్పనలో నిరంతరం
పరిశ్రమ వర్గాలకు చెందిన నిపుణుల భాగస్వామ్యం తీసుకోవటం, ఇతర రాష్ట్రాలలో ఉన్న
సిలబస్ ను అధ్యయనం చేయటం, మారిన సిలబస్ కు అనుగుణంగా అధ్యాపకులకు శిక్షణ
ఇవ్వటం, సకాలంలో పాఠ్యపుస్తకాల ముద్రణ వంటివి సమావేశంలో చర్చనీయాంశం
అయ్యాయన్నారు. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి మోడల్ పాఠ్య ప్రణాళికను సైతం
పరిగణనలోకి తీసుకుని విద్యార్ధులకు మేలు చేకూరేలా 2023-2024 విద్యా
సంవత్సరానికి నూతన పాఠ్య ప్రణాళిక సిద్దం చేయటమే తమ ముందున్న ధ్యేయమన్నారు.
ప్రస్తుతం ఉన్న కోర్సుల సిలబస్ మార్పుతో పాటు, నూతన కోర్సుల రూపకల్పన జరగాలని
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారని తదనుగుణంగా వ్యవహరిస్తున్నామని
నాగరాణి పేర్కొన్నారు. 5జి సాంకేతికత, త్రిడి ప్రింటింగ్, కోడింగ్ వంటి
అంశాలకు ప్రస్తుతం డిమాండ్ ఉందని దానికి అనుగుణంగా పాలిటెక్నిక్ కోర్సులను
రూపకఃల్పన చేస్తామన్నారు.