వెలగపూడి : ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ఐకాస నేతలు
ప్రభుత్వాన్ని కోరారు. సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమం తప్పదని ప్రభుత్వాన్ని
హెచ్చరించారు. సీఎం జగన్ ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి అమలుకు నోచుకోలేదని ఆవేదన
వ్యక్తం చేశారు.
ఉద్యోగుల సమస్యలను ఈ నెల 26వ తేదీ లోపు పరిష్కరించకపోతే ఉద్యమం తప్పదని
రాష్ట్ర ఐకాస నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఉద్యోగుల సమస్యలు
పరిష్కరించాలని ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వాన్ని కోరుతూనే ఉన్నారు. ఈ నెల 26వ
తేదీన కార్యవర్గ సమావేశాన్ని నిర్వహిస్తామని వెల్లడించారు. ఆ సమావేశంలో
కార్యాచరణ ప్రకటిస్తామని ఏపీ ఐకాస అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు,
పలిశెట్టి దామోదరరావు తెలిపారు. సాక్షాత్తు సీఎం జగన్మోహన్ రెడ్డి గత సంవత్సరం
ఫిబ్రవరిలో ఉద్యోగ సంఘ నేతలకు హామీలు ఇచ్చారని పేర్కొన్నారు. అందులో ఏ ఒక్క
హామీ అమలుకు నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
సీఎస్‌కు వినతి పత్రం : సీఎం జగన్ ఇచ్చిన హామీలపై పలుమార్లు మొరపెట్టుకున్నా
పరిష్కారం కనిపించడంలేదని వెల్లడించారు. నెలవారీ జీతాలు, పెన్షన్ల చెల్లింపుల
గురించి చెప్పాల్సి రావడం సిగ్గు చేటని అన్నారు. ఉద్యోగుల ఆర్థిక, ఆర్థికేతర
సమస్యలను తక్షణం పరిష్కరించాలని కోరారు. నేరుగా సీఎస్ జవహర్ రెడ్డిని కలిసి
ఆయనకు వినతిపత్రం సమర్పించారు. గతేడాది పదవీ విరమణ చేసిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు
ఎలాంటి ప్రయోజనాలు అందడంలేదని తెలిపారు. పీఆర్సీ బకాయలు చెల్లించడం లేదని
వివరించారు. పెండింగ్ డీఏలు ఇవ్వడంలేదని వినతి పత్రంలో తెలియజేశారు.