విజయవాడ : పోరాటాలు, ఉద్యమాల నిర్మాణానికి కేంద్రంగా సిపిఎం రాష్ట్ర నూతన
కార్యాలయం నిలుస్తుందని పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు ఎం.ఏ.బేబీ,
బి.వి.రాఘవులు అన్నారు. విజయవాడ రాఘవయ్యపార్కు సమీపంలో నూతనంగా నిర్మించిన
సిపిఎం రాష్ట్ర కార్యాలయాన్ని సోమవారం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు
బి.వి.రాఘవులుతో కలిసి ప్రారంభించారు. అంతకు ముందు పార్టీ పతాకాన్ని సీనియర్
నాయకులు పి.మధు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో
బేబీ మాట్లాడుతూ పార్టీ కార్యాలయం ప్రజాతంత్ర, అభ్యుదయ ఉద్యమాలకు చైతన్య
వేదిక అన్నారు. దేశం ఫాసిస్టు ఆర్ఎస్ఎస్ మార్గదర్శకత్వంలోని బిజెపి
చేతుల్లోకి వెళుతోందని తెలిపారు. నేడు దేశం ఎదుర్కొంటోన్న అతిపెద్ద సవాల్
ఇదేనని అన్నారు. వాటికి వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించే ఉద్యమ శక్తులకు ఈ
కార్యాలయం కేంద్రం కావాలని తెలిపారు. కేంద్రం నిరంకుశ విధానాలతో అన్ని
రాష్ట్రాలూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. దేశం అదానీ, అంబానీ, మాఫియా
చేతుల్లోకి వెళుతోందని విమర్శించారు. దీనికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా
పెద్దఎత్తున పోరాడాల్సిన అవసరం ఉందని వివరించారు. రాష్ట్రాల్లో అధికారాల కోసం
బిజెపి కుట్రలు చేస్తోందని పేర్కొన్నారు. త్రిపురలో ఎన్నికలు జరుగుతుంటే
అక్కడకు గుజరాత్‌తోపాటు బిజెపి పాలిత రాష్ట్రాల నుండి పోలీసు బలగాలను
తీసుకొస్తున్నారని లెఫ్ట్ పార్టీల కార్యాలయాలను వారు టార్గెట్ చేశారని
వివరించారు.గతంలో భద్రత కోసం బిఎస్ఎఫ్ సిబ్బంది వచ్చేవారని, ఇప్పుడు బిజెపి
పాలిత రాష్ట్రాల పోలీసులు రావడం ఏమిటో అర్థం కావడం లేదని అన్నారు.
పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు మాట్లాడుతూ రాష్ట్రం
ఎదుర్కొంటున్న సమస్యలపై సిపిఎం సూత్ర బద్ధ వైఖరితో పనిచేస్తోందని తెలిపారు.
రాష్ట్రం నేడు క్లిష్టమైన పరిస్థితుల్లో ఉందని అన్నారు. బిజెపి రాష్ట్రంలో
బలంగా లేకపోయినా ప్రధాన పార్టీల మెతకవైఖరితో అది పెత్తనం సాగిస్తోందని
తెలిపారు. ఈ నేపథ్యంలో బిజెపికి వ్యతిరేకంగా కలిసొచ్చే వారందరినీ కలుపుకుని
విస్తృత పోరాటాలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. మార్చిలో దేశవ్యాప్తంగా
పెద్దఎత్తున రాజకీయ ప్రచారోద్యమం నిర్వహిస్తామని తెలిపారు.
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో
కేంద్ర కమిటీ సభ్యులు ఎం.ఏ. గఫూర్, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు
వై.వెంకటేశ్వరరావు, సిహెచ్.బాబూరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు
జల్లి విల్సన్ తదితరులు పాల్గొన్నారు.