విజయవాడ : ఓ వివాహితను ఈవ్‌టీజింగ్ చేయడమే కాకుండా ఆమెపై చాకుతో
ఇష్టానుసారంగా టీడీపీకి చెందిన అన్నదమ్ములు దాడి చేసిన ఘటన విజయవాడ
వించిపేటలో జరిగింది. సోమవారం మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ
బాధితురాలు ఇంటికి చేరుకుని ఆమెను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ ప్రాంతంలో
నిరంతర గస్తీ పోలీస్ పికేట్ ఏర్పాటు చేయాలని నగర పోలీస్ కమిషనర్ ను
అదేశించారు.
ఈ సందర్భంగా వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ ‘నరేష్’ అనే వ్యక్తి పట్ట పగలు ఒక
పెళ్ళైన అమ్మాయిని ప్రతి రోజు రోడ్డు మీద నువ్వు నాకు లొంగిపోతావా? లేదా? అని
వేధిస్తుంటే ఆ అమ్మాయి భరించలేక చివరికి ఒక రోజు పోలీస్ కంప్లైంట్ కూడా
ఇవ్వలేదు. ఆమె ఇంట్లో వాళ్ళకు చెప్పుకుంది. భర్తకు, అత్తకు, మామకు నన్నిట్లా
రోజు రోడ్డు మీద వేధిస్తున్నాడని చెబితే, వాళ్ళు వడ్డాది రమణ డివిజన్ తెలుగు
దేశం పార్టీ నాయకుడి అని చెబుతున్న అతని తమ్ముడు నరేష్ ఇంటికి వెళ్లి ఇది
సరైనదేనా అని అడిగినందుకు, వాళ్ళు మొత్తం కలిసి రాత్రి బాధితురాలి ఇంటిపై దాడి
చేశారు. రాళ్లతోటి, లైట్లు పగలకొట్టి, కత్తుల తో ఆ అమ్మాయిని చంపబోయారు. గొంతు
మీద కట్టి పెట్టబోతే అత్త అడ్డువెళ్ళడంతో ఆమె చెయ్యి నరికారు.
ఒక రౌడీ షీటర్ లేకపొతే ఇట్లాంటి ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే వారిని విజయవాడ
రోడ్డులో ఇలా వదిలేస్తున్నాము అంటే తెలుగుదేశం పార్టీ బాధ్యత వహించాలి.
తెలుగుదేశం పార్టీ నాయకులను ఇట్లా అచ్చోసిన ఆంబోతుల్లాగా వీధుల్లోకి
వదిలేయాలని చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారా? ఈ రోజు జరిగిన సంఘటనలో ఎందుకు
మీరు స్పందించలేదు? విజయవాడ నగరంలో ఒక 14 ఏళ్ళ అమ్మాయి ప్రాణాలను
బలిగొన్నటువంటి నాయకుడి మీద మాట్లాడకపోవడంతో ఇవాళ అట్లాంటి వారు అనేకమంది
చెలరేగి పోతున్నారు. ఇవాళ ఈ సంఘటన మీద సాక్ష్యాత్తు చంద్రబాబు నాయుడు
స్పందించాల్సినటువంటి అవసరం వుంది. ఎందుకంటే మీ పార్టీ జెండా చూపి, మీ పార్టీ
వెనుక వుందని చెప్పి ఇంత అఘాయిత్యాలు, అకృత్యాలు ఇక్కడ జరుగుతూవున్నాయి. మీ
అండ చూసుకొని అనేక కుటుంబాలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు.