విజయవాడ : పలు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కొత్త గవర్నర్లను నియమించింది. ఈ
క్రమంలో ఏపీ ప్రస్తుత గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను ఛత్తీస్ గఢ్ కు బదిలీ
చేసింది. ఆయన స్థానంలో కొత్త గవర్నర్ గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి
సయ్యద్ అబ్దుల్ నజీర్ ను నియమించింది. ఈ నేపథ్యంలో కొత్త గవర్నర్ గా
నియమితులైన జస్టిస్ అబ్దుల్ నజీర్ ని రాష్ట్రానికి ఆహ్వానించబోతుండటం తనకు
చాలా సంతోషాన్ని కలిగిస్తోందని ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. ఆయనకు మనస్పూర్తిగా
స్వాగతం పలుకుతున్నానని అన్నారు. మీతో కలిసి పని చేస్తూ రాష్ట్రాన్ని మరింత
అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు వేచి చూస్తున్నానని తెలిపారు.
బిశ్వభూషన్ బదిలీ కావడంపై స్పందిస్తూ ఆయనతో కలిసి పని చేయడాన్ని గౌరవంగా
భావిస్తున్నానని జగన్ చెప్పారు. ఆయనతో తన అనుబంధం ఆత్మీయతతో కూడుకున్నదని
అన్నారు. రాష్ట్రం నుంచి ఆయన వెళ్లిపోవడం బాధాకరమని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర
ప్రభుత్వాల మధ్య సమన్వయం సజావుగా సాగడంలో బిశ్వభూషణ్ కీలక పాత్ర పోషించారని
కొనియాడారు. ఏపీకి ఆయన చేసిన సేవలకుగాను కృతజ్ఞతలను తెలియజేస్తున్నానని
చెప్పారు. ఛత్తీస్ గఢ్ గవర్నర్ గా కొత్త బాధ్యతలను స్వీకరించబోతున్న
బిశ్వభూషణ్ కు అభినందనలు తెలియజేశారు.