ప్రారంభానికి జువ్వలదిన్నె హార్బర్ సిద్దం
ఎంపీ విజయసాయి రెడ్డి
విజయవాడ : రాష్ట్రంలో 3520.56 కోట్లతో 9 ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటు కానున్నట్లు రాజ్యసభ సభ్యులు, వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఆదివారం పలు అంశాలను వెల్లడించారు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ప్రారంభానికి తుదిమెరుగులు దిద్దుకుంటోందని అలాగే ఉప్పాడ, నిజాంపట్నం, మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్లు నిర్మాణం శరవేగంగా జరుగుతోందని అన్నారు. భారీ బోట్ల రాకకోసం బ్రేక్ వాటర్ ఛానల్ నిర్మాణం పూర్తయినట్లు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మత్స్యకారుల జీవితాల్లో కొత్త వెలుగులు వచ్చాయని, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణంతో 60,858 మత్స్యకార కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందని అన్నారు.
విద్యాలయాలుగా ఆర్బీకేలు
రైతు భరోసా కేంద్రాలు విద్యాలయాలు మారనున్నాయని, యూనివర్సిటీల్లో పాఠ్యాంశంగా ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రభుత్వం సిలబస్ లో చేర్చిందని విజయసాయి రెడ్డి అన్నారు. డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు ఆర్బీకేల్లో ఇంటర్న్ షిప్ కల్పించనున్నారని, నెల నుంచి ఐదు నెలలపాటు వీటి కేంద్రంగానే పాఠాలు నేర్పించనున్నట్లు తెలిపారు.
వ్యవసాయ స్టార్ట్ అప్స్ ను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి
దేశంలో వ్యవసాయ స్టార్ట్ అప్స్ ను పెద్ద ఎత్తున ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని విజయసాయి రెడ్డి అభిప్రాయపడ్డారు. వ్యవసాయ క్షేత్రంలో మట్టి పరీక్షలు నిర్వహించడం నుండి పంటను మార్కెటింగ్ చేసేవరకు ప్రయోగాలు, ఉపాధి, వ్యాపారాలకు అనేక అవకాశాలు ఉన్నాయని తెలిపారు. వ్యవసాయ రంగానికి సంబంధించి అనేక సమస్యలు స్టార్ట్ అప్స్ ను ప్రోత్సహించడం ద్వారా పరిష్కారం కాగలవని అన్నారు.
ఏపీ కొత్త గవర్నర్ కు అభినందనలు
ఏపీ కొత్త గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ కు అభినందనలు తెలియజేస్తున్నానని, ఆయన విశేష అనుభవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ప్రజలకు ఎంతగానో సహాయపడుతుందని విజయసాయి రెడ్డి తెలిపారు. ఆయన పదవీ కాలం విజయవంతంగా సాగాలని కోరుకుంటున్నానని ఆయన అన్నారు.