విజయవాడ : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో పేదల జీవితాలు ఎంతగానో
మెరుగుపడ్డాయని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది
విష్ణు తెలిపారు. శనివారం 58 వ డివిజన్ 241 వ వార్డు సచివాలయ పరిధిలో నగర
డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డితో కలిసి గడపగడపకు మన ప్రభుత్వం
కార్యక్రమం నిర్వహించారు. తమ్మిన దుర్గారావు వీధిలో విస్తృతంగా పర్యటించి..
141 గడపలను సందర్శించారు. మౌలిక సదుపాయాలపై ప్రజలను ఆరా తీశారు. వైఎస్సార్
సీపీ అధికారంలోకి వచ్చిన మూడున్నరేళ్ల కాలంలో ఈ ప్రాంతం ఎంతగానో మార్పు
చెందిందని స్థానికులు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లాది విష్ణుని
దుశ్శాలువలు, పుష్పగుచ్ఛాలతో సత్కరించి తమ కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్యమంత్రి
వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో అభివృద్ధి నిరంతరం ప్రక్రియగా కొనసాగుతున్నట్లు
మల్లాది విష్ణు తెలిపారు. దాదాపు రూ. 15 కోట్ల నిధులను ఈ ప్రాంత అభివృద్ధికి
వెచ్చించినట్లు పేర్కొన్నారు. అలాగే ప్రతి సచివాలయం పరిధిలో రూ.20 లక్షలు
మంజూరు చేయడం వల్ల ప్రజల వద్దకు వెళ్లినప్పుడు తమ దృష్టికి వచ్చిన సమస్యలను
వెనువెంటనే పరిష్కరించడానికి అవకాశం లభించిందన్నారు. అనంతరం ప్రజలతో మమేకమై
గ్రీవెన్స్ స్వీకరించారు. అవసరమైన చోట వీధి దీపాలతో పాటు స్పీడ్ బ్రేకర్లు
ఏర్పాటు చేయవలసిందిగా అధికారులకు సూచించారు. అనంతరం మీడియతో మాట్లాడారు.
నారాసుర రక్తచరిత్రను ప్రజలు ఎన్నటికి మరువరు
రాష్ట్రంలో చంద్రబాబుని మించిన క్రిమినల్ లేరని మల్లాది విష్ణు విమర్శించారు.
రాజకీయంగా ఉన్నత స్థానానికి ఎదిగేందుకు కుట్రలు, కుతంత్రాలు, వెన్నుపోట్ల
మార్గాన్నే ఎంచుకున్న చంద్రబాబు.. సీఎం వైఎస్ జగన్ కుటుంబంపైన విమర్శలు
చేయించడం సిగ్గుచేటన్నారు. దొంగ కేసులు పెట్టడం, దొంగ దెబ్బ తీయడం ప్రతిపక్ష
నేతకు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. ఎన్టీఆర్ కి వెన్నుపోటుతో
మొదలైన నారాసుర రక్త చరిత్ర 2019 వరకు సాగిందన్నారు. ముఖ్యంగా గత ఐదేళ్ల
టీడీపీ పాలనలో మీరు సాగించిన హత్యాకాండలో వందలాది మంది వైఎస్సార్ సీపీ
కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయిందా వాస్తవం కాదా..? అని సూటిగా ప్రశ్నించారు.
చంద్రబాబు జీవిత పుస్తకంలో పేజీకో కుట్ర, కుతంత్రం, కుటిల నీతి, హత్యలు
కన్పిస్తాయని ఆరోపించారు. పైగా రౌడీలు, గూండాలు, నేరస్తులను పక్కన పెట్టుకుని
ప్రజలను రెచ్చగొట్టే విధంగా చంద్రబాబు, నారా లోకేష్ మాట్లాడుతున్నారని
మండిపడ్డారు. సీఎం జగన్ సుపరిపాలనపై బురద చల్లడం, ఎలాగైనా అధికారాన్ని
చేజిక్కించుకోవాలనే రెండు ప్రధాన అజెండాలతో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ
పనిచేస్తోందన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా 2024 లో మరోసారి సీఎం వైఎస్
జగన్మోహన్ రెడ్డి చరిత్రను తిరగరాయడం ఖాయమని, 175 స్థానాలలో వైఎస్సార్ సీపీ
గెలుపును ఎవరూ ఆపలేరని స్పష్టంచేశారు.