రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
విజయవాడ : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం
మౌలిక సదుపాయాల కల్పనకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తున్నట్లు రాష్ట్ర ప్లానింగ్
బోర్డు వైస్ చైర్మన్, నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు తెలిపారు. 58వ
డివిజన్ లో రూ. 33.67 లక్షల విలువైన అభివృద్ధి పనులకు డిప్యూటీ మేయర్ అవుతు
శ్రీశైలజారెడ్డిలతో కలిసి శుక్రవారం ఆయన భూమిపూజ నిర్వహించారు. అనంతరం మల్లాది
విష్ణు మాట్లాడుతూ.. అధికారాన్ని ప్రజల కోసం ఏవిధంగా వినియోగించాలో చంద్రబాబు,
గత పాలకులకు తెలియదని విమర్శించారు. ఐదేళ్లు అమరావతి నామ జపం తప్ప నగర ప్రజలకు
కావలసిన కనీస మౌలిక సదుపాయాలను కల్పించడంలో పూర్తిగా వైఫల్యం చెందారని
ఆరోపించారు. కానీ వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని డివిజన్లకు
సమానంగా నిధులు కేటాయిస్తూ మునుపెన్నడూ లేని విధంగా ఆయా ప్రాంతాలను అభివృద్ధి
పరుస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా రూ.19.97 లక్షలతో ఇందిరానాయక్
నగర్ (జమ్మిచెట్టు సెంటర్ దగ్గర) 3వ క్రాస్ రోడ్డులో సీసీ రహదారి నిర్మాణ
పనులు రూ. 13.70 లక్షల వ్యయంతో నందమూరి నగర్ క్రాస్ రోడ్ల నందు నీటి సరఫరా
పైపు లైన్ల ఏర్పాటు పనులను ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. దీని ద్వారా
నందమూరినగర్ పరిసర ప్రాంతాలలో సుమారు 6వేల మంది జనాభాకు మంచినీటి సరఫరా
మెరుగుపడుతుందని తెలిపారు. వీలైనంత త్వరగా నాణ్యతా ప్రమాణాలతో పనులు
పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో నాయకులు అవుతు
శ్రీనివాసరెడ్డి, అఫ్రోజ్, వీఎంసీ సిబ్బంది, కాలనీ వాసులు, పార్టీ శ్రేణులు
పాల్గొన్నారు.