విజయవాడ : విజయవాడ నగరం నడిబొడ్డులో ఉన్న ఎస్ ఆర్ ఆర్ అండ్ సివిఆర్ ప్రభుత్వ
డిగ్రీ కాలేజీకి సంబంధించి 6.67 ఎకరాల అతి విలువైన ప్రభుత్వ భూమిని కబ్జాదారుల
కోరల నుంచి కాపాడుతామని విద్యాశాఖ మంత్రి బొత్సా సత్యనారాయణ హామీ ఇచ్చారు.
కోట్లాది రూపాయల విలువచేసే ఈ భూమిని గత కొంతకాలంగా ఆక్రమణ దారులు స్వాధీనం
చేసుకునే ప్రయత్నాలు ఇకమీదట సాగవని ఆయన హెచ్చరించారు. పూర్వ విద్యార్థుల సంఘం
ఆధ్వర్యంలో గురువారం మంత్రిని విజయవాడలో ని ఆయన నివాసంలో కలిశారు. ఎస్ఆర్ఆర్
కాలేజీ పూర్వ విద్యార్థి అయిన అధికార భాషా సంఘం అధ్యక్షుడు విజయ బాబు
ఆధ్వర్యంలో డాక్టర్ వెలగా జోషి, జానయ్య , వేణుగోపాల్, ఎన్విఆర్ ,శ్రీధర్ తదితర
పూర్వ విద్యార్థులు మంత్రిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఎస్ ఆర్ ఆర్, సి వి
ఆర్ కాలేజీకి సంబంధించి 6.67 ఎకరాల భూమి ఉందని, దీన్ని కొంతకాలంగా నగరంలోని
కొంతమంది కబ్జా చేయాలనే ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి దృష్టికి
తీసుకువచ్చారు. ఇప్పటికే దీనిలో కొంత భాగాన్ని నగరంలో ఉన్న కొంతమంది ఆక్రమించి
భవనాలు నిర్మాణం కూడా చేశారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఇప్పటికే
విద్యాశాఖ ఉన్నతాధికారులు, పోలీసు అధికారులు, నగరంలో ఉన్న నాయకుల దృష్టికి
పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో అనేక సందర్భాల్లో తీసుకెళ్లిన విషయాన్ని
కూడా మంత్రికి వివరించారు .దీనిపై స్పందించిన విద్యాశాఖ మంత్రి బొత్సా
సత్యనారాయణ మాట్లాడుతూ ఎంతో విలువైన కాలేజీ స్థలాన్ని తప్పకుండా కాపాడుతామని
మంత్రి హామీ ఇచ్చారు. దీనికి సంబంధించి అవసరమైతే ముఖ్యమంత్రి దృష్టికి కూడా
తీసుకెళ్లి సమగ్ర సర్వే నిర్వహించి కాలేజీ స్థలంలో ఉన్న అక్రమ నిర్మాణాలను
కూడా తొలగిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. దీనికి సంబంధించి ఉన్నత విద్యాశాఖ
అధికారులు, పోలీసు ,రెవెన్యూ యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేస్తామని మంత్రి
హామీ ఇచ్చారు. ఎస్ ఆర్ ఆర్ కాలేజీ లో ఉర్దూ మీడియాన్ని గత కొంతకాలంగా
నిర్వహిస్తున్నారని, అయితే విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించడానికి రెగ్యులర్
ఉపాధ్యాయులు లేక పోవడంతో ఇబ్బంది ఎదురవుతుందని మంత్రి దృష్టికి పూర్వ
విద్యార్థుల సంఘం తీసుకెళ్లింది. దీనిపైన మంత్రి సానుకూలంగా స్పందించారు.
ఉర్దూ మీడియం చదివే విద్యార్థుల కోసం పోస్టులను సాంక్షన్ చేసే అంశాన్ని
పరిశీలిస్తామని, దీనిపై ఉన్నత విద్యాశాఖ అధికారులతో త్వరలోనే సమావేశం
నిర్వహించి తగిన చర్యలు చేపడతామని మంత్రి హామీ ఇచ్చారు.