విజయవాడ : జర్నలిస్టులను శత్రువులుగా పరిగణించే ప్రభుత్వాలకు మనుగడ ఉండదని
ఐజేయూ అధ్యక్షులు కే శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర,
విజయవాడ అర్బన్ యూనిట్ ఆధ్వర్యంలో ముద్రించిన మీడియా డైరీలను ఆయన
ఆవిష్కరించారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్
అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీనివాస రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొని
ప్రసంగిస్తూ ప్రభుత్వ విధానాలను విమర్శించే జర్నలిస్టులపై పదేపదే కేసులు
పెట్టి వేధించడం అత్యంత దారుణమని ఆయన అన్నారు. నిత్యం ప్రభుత్వ వ్యతిరేక
వార్తలు రాసే పత్రికలపై ఇప్పటి వరకూ ఎన్ని కేసులు పెట్టారో తెలియజేయవలసిన
అవసరం ఉందన్నారు. కోవిడ్ సమయంలో మృతి చెందిన జర్నలిస్టులకు ఆర్థిక సహాయం చేసే
విషయంలో ప్రభుత్వం జీవో విడుదల చేసి కూడా దాన్ని అమలు చేయకపోవడం అమానవీయమని
శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పొరుగు రాష్ట్రాల సైతం కోవిడ్ లో చనిపోయిన
జర్నలిస్టులను ఆదుకున్నాయని అటువంటి మానవత్వం ఏపీ ప్రభుత్వానికి కొరవడిందని
విమర్శించారు. సమాజంలో మార్పు అనివార్యం అయితే ఆమార్పు ప్రజామోదం పొందేదిగా
ఉండాలన్నారు. జర్నలిస్టులకు ఈ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తుందనే
ఆశాభావం తనకు లేదని స్పష్టం చేశారు. జర్నలిస్టులకు సంక్షేమ పథకాలను
నిలిపివేసిన ఈ ప్రభుత్వం హెల్త్ కార్డులు, ఇన్సూరెన్స్ లకు డబ్బులు
చెల్లించమంటుందని, జర్నలిస్టులు వేసే బిక్షతోనే నడుస్తుందంటే రాష్ట్ర అర్ధిక
పరిస్థితి ఎట్లా ఉందనేది అవగతం అవుతుందన్నారు. నిజంగా రాష్ట్ర ఖజానా అలాగే
ఉందని తెలియజేస్తే బిక్షగా భావించి చెల్లిస్తామన్నారు. జర్నలిస్టులకు
ఎంతోకాలంగా అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను నిలిపివేసి కక్ష సాధింపు చర్యలకు
పాల్పడటం శోచనీయన్నారు. ఐకేయూ ఉపాధ్యక్షులు అంబటి ఆంజనేయులు మాట్లాడుతూ
జర్నలిస్టుల సంక్షేమం కోసం నిరంతరం పోరాడుతున్న ఐజేయూ అధ్యక్షులు
శ్రీనివాసరెడ్డి కృషి అభినందనీయమన్నారు. జర్నలిస్టులకు సంబంధించిన సంక్షేమ
పథకాలన్నీ ఏపీయూడబ్ల్యూజే యూనియన్ ఆ ఆధ్వర్యంలో సాధించినవేనని ఈ సందర్భంగా
గుర్తుచేశారు. మూడున్నర దశాబ్దాలుగా యూనియన్ ఆధ్వర్యంలో డైరీలను ముద్రించడం
యూనియన్ కు ఎంతో గర్వకారణం అన్నారు. సభకు అధ్యక్షత వహించిన ఏపీయూడబ్ల్యూజే
రాష్ట్ర ప్రధానకార్యదర్శి చందు జనార్థన్ మాట్లాడుతూ సీఎం ప్రకటించిన విధంగా
కోవిడ్ లో మృతిచెందిన జర్నలిస్టుల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని
జర్నలిస్టుల సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్
చేశారు. ఈ విషయంలో13 వేలమంది జర్నలిస్టులతో సంతకాలు చేసి ప్రభుత్వానికి
తెలియజేసినప్పటికీ ఎలాంటి స్పందన లేకపోవడం శోచనీయమన్నారు. ఈ సందర్భంగా అర్బన్
యూనిట్ ఆధ్వర్యంలో ఐజేయూ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, ఉపాధ్యక్షులు అంబటి
ఆంజనేయులు, రాష్ట్ర ప్రధానకార్యదర్శి చందు జనార్థన్ లను ఘనంగా సన్మానించారు. ఈ
సందర్భంగా విజయవాడ యూనిట్ అర్బన్ కార్యదర్శి కొండా రాజేశ్వరరావు అతిధులను
స్వాగతించగా అధ్యక్షులు చావా రవి వందన సమర్పణ చేశారు.