ఏపీలో ఈ నెల 11 నుంచి వైసీపీ కొత్త కార్యక్రమం
ఇంటింటికీ వెళ్లనున్న వలంటీర్లు, గృహ సారథులు
ప్రభుత్వం నుంచి అందుతున్న పథకాలపై వివరాల సేకరణ
ఇంటి యజమాని అనుమతితో స్టిక్కర్
అమరావతి : ఏపీలో వైసీపీ కొత్త కార్యాచరణకు సిద్ధమవుతోంది. ఈ నెల 11 నుంచి
రాష్ట్రంలోని ఇంటింటికీ వలంటీర్లు, ఏరియా గృహ సారథులు వెళ్లి ప్రభుత్వం నుంచి
అందుతున్న పథకాలపై వివరాలు తెలుసుకుంటారు. అనంతరం, ‘మా నమ్మకం నువ్వే జగన్’
అని రాసి ఉన్న స్టిక్కర్ ను ఇంటికి అంటిస్తారు. ఆ స్టిక్కర్ పై సీఎం జగన్
బొమ్మ ఉంటుంది. అయితే, స్టిక్కర్ అతికించేముందు ఇంటి యజమాని నిర్ణయం
అడుగుతారు. ఇంటి యజమాని అంగీకరిస్తేనే స్టిక్కర్ ను అతికిస్తారు. కాగా ఏపీలో
ఇప్పటికే వలంటీర్ల వ్యవస్థ ఉండగా, కొత్తగా ప్రతి 50 ఇళ్లకు ఒక గృహ సారథిని
నియమిస్తున్నారు. వైసీపీ నూతన కార్యక్రమంలో ఈ గృహ సారథులు కీలకపాత్ర
పోషించనున్నారు. కాగా ‘జగనన్నకు చెబుదాం’ అనే మరో కార్యక్రమానికి కూడా
అధికారపక్షం రూపకల్పన చేస్తున్నట్టు తెలుస్తోంది.