గుంటూరు : రైతన్నకు ఎలాంటి కష్టం లేకుండా ఈ ఖరీఫ్ లో పండించిన చివరి దాన్యపు
గింజ వరకు కొనుగోలు చేస్తామని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టమైన
హామీ ఇచ్చినట్టు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఉప
ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణ దాస్ చెప్పారు. తాడేపల్లి సీఎం నివాసంలో తనయుడు,
యువ నాయకులు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్యతో కలిసి మంగళవారం మధ్యాహ్నం సీఎంను
ఆయన కలిశారు. సుమారు అరగంటసేపు జిల్లా రాజకీయాలు, పలు అభివృద్ధి పనులపై
ముఖ్యమంత్రితో మాట్లాడి స్పష్టమైన హామీ తీసుకున్నట్లు వివరించారు. జిల్లాలో
ఇప్పటికే 4.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడం జరిగిందని, మరో 1.50
లక్షల టన్నుల ధాన్యం రైతుల దగ్గర ఉండిపోయిందని, వారికి కష్టం కలగకుండా చూడాలని
కోరిన మేరకు ముఖ్యమంత్రి పై విధంగా స్పందించారని అన్నారు. అలాగే వంశధార
నిర్వాసితులకు చెల్లించాల్సిన దాదాపు మరో రూ. 25 కోట్లను సైతం విడుదల
చేస్తామని హామీ ఇచ్చారన్నారు. సారవకోట మండలం బొంతు ఎత్తిపోతల పథకానికి
సంబంధించి పెండింగ్లో ఉన్న రూ. 40 కోట్ల నిధులను త్వరలోనే విడుదల చేసి మొదటి
దశ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేసి, ఈ ఏడాది చివరికి నీటిని విడుదల చేసి
తీరుతామన్నారు. పాతపట్నం నియోజకవర్గ పరిధిలో 170 గ్రామాలకు ఉద్దేశించిన
మంచినీటి వాటర్ గ్రిడ్ పథకం పనులను సైతం వేగవంతం చేస్తామని చెప్పారన్నారు.
రూ.50 కోట్లతో నిర్మిస్తున్న పలాస సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు 70 శాతం
పూర్తయ్యాయని ఈ ఏడాదికే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని హామీ
ఇచ్చారన్నారు. అలాగే రూ.700 కోట్లతో నిర్మాణం జరుపుకుంటున్న ఉద్దానం మంచినీటి
పథకాన్ని కూడా వచ్చే ఏడాదికి పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని
హామీ ఇచ్చారన్నారు. జిల్లా అభివృద్ధిపై ముఖ్యమంత్రి ఎంతో స్పష్టమైన విజన్ తో
ఉన్నారని ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ భేటీలో పలు రాజకీయ అంశాలు కూడా
చర్చకు వచ్చాయని కృష్ణదాస్ తెలిపారు.