విజయవాడ : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి
బూడి ముత్యాల నాయుడును కలిసి గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శులకు వీలైనంత త్వరగా
పంచాయతీల పాలనా బాధ్యతలు అప్పగించాలని గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్
ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు ఎం.డి.జాని పాషా కోరారు. రాష్ట్ర
ప్రభుత్వ నిర్ణయంతో గ్రామ పంచాయతీలలో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తామని
మంత్రి హామీ ఇచ్చినట్లు చెప్పారు. త్వరలో గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్సులకు
గ్రామ పంచాయతీల పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకోనున్నట్లు
చెప్పారన్నారు. ప్రభుత్వ ఆమోదం కోసం తుది దశలో పాలనా బాధ్యతల
దస్త్రం-ప్రస్తుతం అమలులో ఉన్న పంచాయతీల క్లస్టర్ వ్యవస్థకు మార్పులతో
గ్రేడ్-5 కార్యదర్శులకు సంపూర్ణ బాధ్యతలు ఉంటాయని తెలిపారు. గ్రామ వార్డు
సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.డి.జాని పాషా
ఆధ్వర్యంలో గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా నియమితులైన గ్రేడ్-5 పంచాయతీ
కార్యదర్సులకు గ్రామ పంచాయతీల అధికారాల కేటాయింపుకు సంభందించిన దస్త్రం
గురించి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి , పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ, గ్రామ
సచివాలయాల శాఖ మంత్రి బూడి ముత్యాల నాయుడును కలిసి గాంధీజీ కలలు కన్న సంపూర్ణ
గ్రామ స్వరాజ్యం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కలలు కన్న అవినీతి రహిత స్థానిక
స్వపరిపాలన శాశ్వతంగా మెరుగైన స్థితికి తీసుకు వచ్చేందుకు సాధ్యమైనంత త్వరగా
గ్రేడ్-5 కార్యదర్శులకు పూర్తి స్థాయి పంచాయతీల పాలనా బాధ్యతలు అప్పగించాలని
అభ్యర్థించడం జరిగిందన్నారు. సానుకూలంగా స్పందించిన మంత్రి తప్పనిసరిగా పాలనా
బాధ్యతల ఫైల్ ను అమోదించి బాధ్యతలు అప్పగిస్తామని తెలిపారు. అలాగే ఉద్యోగులు
సైతం ప్రజలతో సత్సంబంధాలు కలిగి, గ్రామ పంచాయతీలలో ప్రజలకు నాణ్యమైన సేవలు
అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ నాయకులు పి.మనోహర్, యస్.కె.
మెహబూబ్, జి.నవీన్ కుమార్ పాల్గొన్నారు.