ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట తప్పరు..మడమ తిప్పరు అని మరోసారి
నిరూపించుకున్నారు. ప్రజా సంకల్ప యాత్రలో, ఎన్నికల ముందు నిర్వహించిన
బీసీ గర్జనలో బీసీలకిచ్చిన మరో హామీని నిలబెట్టుకున్నారు. దేవదాయ శాఖ
పరిధిలోని ఆలయాల ట్రస్టు బోర్డు సభ్యుల నియామకాల్లో నాయీ బ్రాహ్మణ సామాజిక
వర్గం నుంచి ఒకరికి తప్పనిసరిగా స్థానం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం
నిర్ణయించింది. ఆలయాల్లో పలు కార్యక్రమాల్లో సేవలందించే నాయీ బ్రాహ్మణుల
స్వప్నాన్ని నిజం చేస్తూ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ద్వారా ప్రభుత్వం
ప్రత్యేక ఆర్డినెన్స్ జారీ చేసింది.
దేశ చరిత్రలోనే నాయీ బ్రాహ్మణులకు అరుదైన గౌరవం
రాష్ట్రంలో దేవదాయ శాఖ పరిధిలో ఏడాదికి రూ.5 లక్షల పైబడి వార్షికాదాయం ఉన్న
ఆలయాలు 1,234 వరకు ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ట్రస్టు బోర్డు నియామకాలు
పూర్తయిన వాటిని మినహాయిస్తే మరో 610 ఆలయాలకు కొద్ది రోజుల్లో కొత్తగా
ట్రస్టు బోర్డులను నియమించేందుకు కసరత్తు జరుగుతోంది. వీటిల్లో ప్రతి ఆలయానికి
ఒకరి చొప్పున నాయీ బ్రాహ్మణులకు ట్రస్టు బోర్డులో స్థానం కల్పించే అవకాశం ఉంది.
ఆలయాల వ్యవస్థలో అర్చకులతో పాటు నాయీ బ్రాహ్మణులకు విడదీయరాని బంధం ఉంది.
ఆలయాల్లో భజంత్రీలుగా, క్షురకులుగా, ప్రత్యేక ఉత్సవాల సమయంలో స్వామి వారి
ఊరేగింపు పల్లకీ సేవల్లో నాయీ బ్రాహ్మణులు పాలు పంచుకుంటున్నారు. ఆలయాల్లో పలు
కార్యక్రమాల్లో సేవలందించే తమకు పాలక వర్గాల్లో చోటు కల్పించాలన్న నాయీ
బ్రాహ్మణుల డిమాండ్‌పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన పాదయాత్ర సమయంలో సానుకూల
హామీ ఇచ్చారు. బీసీ గర్జన సభలలోనూ దీనిపై ప్రత్యేకంగా చర్చ జరిగింది. ఇప్పుడు
ఆ హామీని నెరవేరుస్తూ దేవదాయ శాఖ చట్టానికి సవరణ తెచ్చి ప్రభుత్వం
ఆర్డినెన్స్ జారీ చేసింది.
నాడు సచివాలయంలో సమస్యలు వినిపించిన సంఘాల నేతలనుద్దేశించి ‘తోకలు
కత్తిరిస్తా.. ఆలయాల మెట్లు కూడా ఎక్కకుండా చేస్తా’ అంటూ చంద్రబాబు తీవ్ర
స్వరంతో హెచ్చరించారు. ఆలయాల ట్రస్టు బోర్డు నియామకాల్లో తమకు చోటు కల్పిస్తూ
ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయడంపై నాయీ బ్రాహ్మణ సంఘాలు సంతోషం వ్యక్తం
చేస్తున్నారు. టీడీపీ హయాంలో తాము అవమానాలు ఎదుర్కొన్నామని, ఇప్పుడు
వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో సముచితం స్థానం దక్కిందని చెబుతున్నారు.