విజయవాడ : పాలిటెక్నిక్ విద్యార్థులకు సెమికాన్ రంగంలో తక్షణ ఉపాధి కోసం
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని సాంకేతిక
విద్యా శాఖ సంచాలకురాలు చదలవాడ నాగరాణి తెలిపారు. ప్రపంచ ఐపి ఉత్పత్తుల
దిగ్గజం స్మార్ట్ డివి టెక్నాలజీస్ చిత్తూరు జిల్లాలో స్ధాపించనున్న సంస్ధలో
ఈ సంవత్సరం 600 మంది పాలిటెక్నిక్ చివరి సంవత్సరం విద్యార్ధులు ఉద్యోగ
అవకాశాన్ని అందుకోనున్నారని వివరించారు. స్మార్ట్ డివి టెక్నాలజీస్ ఈ నెలలో
పాలిటెక్నిక్ విద్యార్థులకు ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్ననేపథ్యంలో,
మంగళగిరి కమీషనర్ కార్యాలయం నుండి సోమవారం రాష్ట్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్
కళాశాలల అధ్యాపకులు, విద్యార్థులతో నాగరాణి దృశ్య శ్రవణ విధానంలో సమావేశం
నిర్వహించారు. ఈ సందర్భంగా చదలవాడ మాట్లాడతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసుకున్న
ఒప్పందం కారణంగా సెమీకండక్టర్ రంగంలో విస్తృత ఉద్యోగ అవకాశాలు
రానున్నాయన్నారు. స్మార్ట్ డివి టెక్నాలజీస్ నిర్వహిస్తున్న క్యాంపస్ డ్రైవ్
లో అత్యధికంగా అవకాశాలు పొందగలిగేలా పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్స్ కు
దిశా నిర్దేశం చేసామన్నారు. ఈనెల 25వ తేదీన నిర్వహించనున్న రాత పరీక్షకు
విద్యార్ధులను సన్నద్ధం చేసేలా ప్రత్యేక కార్యాచణ సిద్దం చేసామన్నారు.
స్మార్ట్ డివి టెక్నాలజీస్ ఎండి దీపక్ కుమార్ మాట్లాడుతూ చిత్తూరులో ఈ
ఏడాది జూలైలో ప్రారంభించనున్న తమ కంపెనీ కోసం ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్,
ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ విభాగాలలో డిప్లమో చివరి సంవత్సరం
విద్యార్ధులకు రిక్రూట్మెంట్ నిర్వహిస్తున్నామన్నారు. సెమీ కండక్టర్ విభాగంలో
హార్డ్ వేర్ ఉద్యోగులకు సాఫ్ట్ వేర్ ఉద్యోగుల కంటే ఎక్కువగా జీతభత్యాలు
లభిస్తున్నాయన్నారు. హార్డ్ వేర్ ను కెరీర్ గా ఎంచుకొని ఉన్నత స్థానాలకు
చేరుకోవచ్చని తెలిపారు. హైబ్రీడ్ విధానంలో జరిగిన ఈ సమావేశంలో శిక్షణ, ఉపాధి
ఉప సంచాలకులు డాక్టర్ ఎంఏవి రామకృష్ణ, ఓఎస్డిలు ఎం. తిప్పేస్వామి, వి. చైతన్య
తదితరులు పాల్గొన్నారు.