టీడీపీ లో లైన్ క్లియర్ అవుతుందా!
భవిష్యత్ పై నీలి నీడలు
నెల్లూరు : కోటంరెడ్డి శ్రీధరరెడ్డి రాజకీయ భవిష్యత్తు పెనం మీద నుంచి
పొయ్యిలో పడినట్టుగా తయారవుతుందా?. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తమ కుటుంబాన్ని
చీల్చి తమ్ముడికి టికెట్ ఇస్తే గనుక తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని, ఇక
రాజకీయాల్లో పోటీచేయనని గతంలో ఒక ఊహాజనితమైన అంశాన్ని పట్టుకుని భీషణ
ప్రతిజ్ఞలు చేసిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తమ్ముడు తనతోనే ఉన్నప్పటికీ కూడా
రాజకీయ వైరాగ్యానికి గురయ్యే వాతావరణం ఆయనకు తెలుగుదేశంలో ఎదురుకాబోతోందా? అనే
ప్రశ్నలు ప్రజల మదిలో మెదలుతున్నాయి. వైసీపీలో సాక్షాత్తూ సీఎం జగన్మోహన్
రెడ్డి, పదవులు కట్టబెట్టక పోయినా, అపరిమిత ప్రాధాన్యంతో చూసుకుంటున్నప్పటికీ
రకరకాల నిందలు వేసి టీడీపీలోకి వెళుతున్న కోటంరెడ్డికి అక్కడ ముఠాల బెడద
తప్పేలా లేదు. ఆలూ లేదు చూలూ లేదు. కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా ఉంది
పరిస్థితి. కోటంరెడ్డి ఏదో తనంత తాను నెల్లూరు రూరల్ తెలుగుదేశం అభ్యర్థి
తానేనని ప్రకటించుకున్నారే తప్ప దానికి ధ్రువీకరణ ఏం లేదు. ఆయనకు అనుకూలంగా
టీడీపీ పెద్దలు చంద్రబాబు, లోకేష్ వంటి వారు ఇప్పటిదాకా పెదవి విప్పలేదు. తమతో
మాట్లాడినట్లుగా ధ్రువీకరించనేలేదు. ‘వైసీపీ అరాచకల్ని భరించలేని ఎవరు వచ్చినా
చేర్చుకుంటాం’ వంటి జనాంతికమైన సోది డైలాగులు కూడా వేయలేదు. అంటే ఇప్పటిదాకా
టీడీపీ లోకి సాదర ఆహ్వానికి సంబంధించిన సంకేతాలు లేవు. కానీ, మోకాలడ్డే
ప్రయత్నాలు మాత్రం జరుగుతున్నాయి. ఆ జిల్లాకు చెందిన సోమిరెడ్డి చంద్రమోహన్
రెడ్డి మాటలే అందుకు తార్కాణం.
ఎవరికి వారు తమకు తోచినట్టుగా తాము ఎక్కడినుంచి పోటీచేయబోతున్నామో
నియోజకవర్గాలను ప్రకటించుకునే స్వతంత్రత ఉండదని, ఎవరైనా సరే.. పార్టీ నిర్ణయం
మేరకు ఎక్కడ చెబితే అక్కడ పోటీచేయాల్సిందేనని సోమిరెడ్డి అంటున్నారు.
కోటంరెడ్డి ఇప్పటిదాకా తనతో మాట్లాడలేదని కూడా అంటున్నారు. కోటంరెడ్డి
శ్రీధర్ రెడ్డి తన స్థాయి ఏమిటో తెలుసుకోకుండా మంత్రిపదవి మీద ఆశలు
పెట్టుకున్నారు. జగన్ మంత్రి పదవి ఇవ్వలేదని అలిగి తెలుగుదేశంలోకి
వెళుతున్నాడు. చంద్రబాబుతో ఆ ఆశ నెరవేరుతుందా? అసలు ఆ పార్టీ గెలుస్తుందా?
ఒకవేళ గెలిచినా, ఆ వెంటనే, కోటంరెడ్డికి మంత్రిపదవి అప్పగిస్తారా? ఇవన్నీ
సందేహాలే. అసలు ఆ జిల్లా నుంచి మంత్రి పదవికి కర్చీఫ్ వేసుకుని కూర్చుని ఉండే
నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఒకే సామాజిక వర్గం నుంచి, ఒకే జిల్లా
నుంచి ఇద్దరు నాయకులకు పదవులు ఇచ్చేంత దమ్ము చంద్రబాబుకు లేదు గాక లేదు. ఆ
నేపథ్యంలో తనకు కోటంరెడ్డి పోటీ అవుతాడని సోమిరెడ్డి సహజంగానే భయపడతారు.
ముఠాలు కడతారు. వీలైనంత వరకు ఆయన తమ పార్టీలోకి రాకుండా చూస్తారు. ఇప్పుడు ఆయన
మాటలు అలాగే కనిపిస్తున్నాయి. కోటంరెడ్డి ఈ పాటికి చంద్రబాబుతో మాట్లాడుకుని
తన మంత్రాంగం పూర్తిచేసుకుని ఉంటారు గానీ.. ఒక వేళ కొత్తగా ముఠా కడుతున్న
సోమిరెడ్డి యుక్తులు పనిచేస్తే ఆయన పరిస్థితి ఏమవుతుందో తలచుకుంటేనే
భయమేస్తోంది.