విజయవాడ : పేదల లోగిళ్లలో నవరత్నాల పథకాలు కుల, మత, వర్గ భేదాలు లేకుండా
సంక్షేమ వెలుగులు నింపాయని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే
మల్లాది విష్ణు అన్నారు. శనివారం 23 వ డివిజన్ 98 వ వార్డు సచివాలయ పరిధిలో
నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ డివిజన్
ఇంఛార్జి ఆత్మకూరు సుబ్బారావు, కోఆర్డినేటర్ ఒగ్గు విక్కీతో కలిసి ఆయన
పాల్గొన్నారు. బీసెంట్ రోడ్డు, గూడవల్లి వారి వీధి, రాజగోపాలచారి వీధి,
బైరెడ్డి రామన్న వీధి, చీరగుడి వారి వీధి, ప్రకాశం రోడ్డు, అలీబేగ్ వీధి,
బందర్ రోడ్డు, మేరీ వీధులలో విస్తృతంగా పర్యటించి.. 212 ఇళ్లను సందర్శించారు.
సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతకం చేసిన కరపత్రాలను అందజేశారు. రాష్ట్ర
ప్రభుత్వం మూడున్నరేళ్లుగా చేస్తోన్న అభివృద్ధి కార్యక్రమాలు, అమలు పరుస్తున్న
సంక్షేమ పథకాలను వివరించారు. తమ ఇంటికి విచ్చేసిన ఎమ్మెల్యేని ప్రజలు సాదరంగా
ఆహ్వానించి పుష్పగుచ్ఛాలు, దుశ్శాలువలతో ఘనంగా సత్కరించారు. పలువురు పండితులు
వేదాశ్వీచనం అందజేశారు. ఈ సందర్భంగా స్థానికులు, దుకాణదారులు, రోజువారీ కూలీలు
ఇలా అన్ని వర్గాల ప్రజలతో మాట్లాడి సలహాలు, విలువైన సూచనలను స్వీకరించారు.
సచివాలయానికి కేటాయించిన రూ. 20 లక్షల నిధులతో ఈ ప్రాంత ప్రజలకు మరింత మెరుగైన
మౌలిక సదుపాయాలు కల్పిస్తామని తెలియజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
క్యాన్సర్ రహిత సమాజం ప్రతిఒక్కరి లక్ష్యం కావాలి
క్యాన్సర్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని మల్లాది విష్ణు
అన్నారు. ఈ మహమ్మారి పట్ల ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించి నివారణకు
ప్రోత్సహించడమే ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.
క్యాన్సర్‌ను తొలిదశలోనే గుర్తించడం ద్వారా త్వరగా నిర్మూలించే అవకాశం
ఉంటుందన్నారు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, వ్యాయామం, పొగాకుకు దూరంగా ఉండటం,
ఆల్కహాల్‌ను పరిమితం చేయడం వంటి చక్కని ఆరోగ్య సూత్రాలను పాటించడం ద్వారా
క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చన్నారు. ఆరోగ్యశ్రీకి సంబంధించిన
ప్రొసీజర్లలో 400 ప్రొసీజర్లు ఒక్క క్యాన్సర్ కు సంబంధించినవి ఉన్నాయని,
రాష్ట్ర బడ్జెట్లో క్యాన్సర్ నివారణకు రూ.400 కోట్లను ఈ ప్రభుత్వం
కేటాయించినట్లు చెప్పారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం
తీసుకుంటున్న చర్యలతో రాబోయే రోజుల్లో క్యాన్సర్ నివారణలో ఆంధ్రప్రదేశ్
రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో నిలవడం ఖాయమని స్పష్టం చేశారు.