విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్నివిధాలా ముందుకు తీసుకెళ్లాలనే దృఢ
సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పని చేస్తోందని
ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు.
శుక్రవారం 23 వ డివిజన్ 98 వ వార్డు సచివాలయ పరిధిలో నిర్వహించిన గడప గడపకు మన
ప్రభుత్వం కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ డివిజన్ ఇంఛార్జి ఆత్మకూరు సుబ్బారావు,
కోఆర్డినేటర్ ఒగ్గు విక్కీతో కలిసి ఆయన పాల్గొన్నారు. తొలుత దివంగత నేత
వంగవీటి మోహనరంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం
కాంగ్రెస్ ఆఫీస్ రోడ్డు, యామల వారి వీధి, ఆకుల వారి వీధి, పాలపర్తి వారి వీధి,
మద్దులపల్లి వారి వీధి, గోపాలరెడ్డి రోడ్డు, పెద్దిబొట్ల వారి వీధి, బీసెంట్
రోడ్డు, గూడవల్లి వారి వీధి, రాజగోపాలచారి వీధులలో విస్తృతంగా పర్యటించి.. 148
ఇళ్లను సందర్శించారు. కూలీలు, వర్తక వ్యాపారస్తులు ఇలా ప్రతిఒక్కరినీ పేరు
పేరునా ఆప్యాయంగా పలకరిస్తూ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కరోనా
సమయంలో రాష్ట్ర ప్రభుత్వం, వాలంటీర్ వ్యవస్థ అందించిన సేవలను మరువలేమని ప్రజలు
చెప్పడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా మూడున్నరేళ్ల కాలంలో సంక్షేమం,
అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న మేలును బుక్ లెట్ల
ద్వారా అంకెలతో సహా లబ్ధిదారులకు వివరించారు.
అవాకులు చవాకులు పేలితే ఉపేక్షించేది లేదు
రాష్ట్ర ప్రభుత్వంపై, సీఎం వైఎస్ జగన్ పై అవాకులు, చెవాకులు పేలితో
ఉపేక్షించేది లేదని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణు
హెచ్చరించారు. ముఖ్యమంత్రిని కించపరుస్తూ చంద్రబాబు, నారాలోకేష్ చేసిన
వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందించారు. రాజకీయాల్లో విమర్శలు సహజమని.. కానీ
భాషలో విచక్షణ లేకుండా మాట్లాడటం తగదన్నారు. కనీస సంస్కారం కూడా లేకుండా
హీనమైన భాషను నారా లోకేష్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం
అనుమతి లేనిదే ఏపీలోకి సీబీఐ రాకూడదని భయంతో ఆనాడు జీవో జారీ చేసింది
చంద్రబాబు ప్రభుత్వం కాదా..? అని సూటిగా ప్రశ్నించారు.
కళాతపస్వి మరణం కలచివేసింది
తెలుగు సినిమా స్థాయిని ఖండాంతరాలకు వ్యాపింపజేసిన కళాతపస్వి కె.విశ్వనాథ్
గారి మరణం కలసివేసిందని మల్లాది విష్ణు అన్నారు. మన సంస్కృతి, సాంప్రదాయాల
గొప్పదనాన్ని చాటిచెప్పేలా ఆణిముత్యాల్లాంటి ఎన్నో దృశ్యకావ్యాలను ఆయన
రూపొందించారన్నారు. ముఖ్యంగా శాస్త్రీయ కళలను కథలుగా తెరకెక్కించిన సిరి
వెన్నెల, స్వర్ణ కమలం, స్వాతి కిరణం వంటి చిత్రాలు కళలకు నీరాజనం
పట్టాయన్నారు. కథకు సంగీతం, నృత్యాన్ని జోడించి అందమైన దృశ్యరూపంగా మలచడంలో
ఆయనకు ఆయనే సాటి అని కీర్తించారు. విశ్వనాథ్ మృతికి తీవ్ర సంతాపం వ్యక్తం
చేస్తూ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.