గుంటూరు : మూడో విడత క్రియాశీలక సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలని జన సేన
అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కోరారు. జనసేన పార్టీకి కార్యకర్తలే బలం. వారే మా
సంపద. రెండు విడతలుగా విజయవంతం అయిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు
ప్రక్రియ మూడో విడతగా ఈ నెల 10వ తేదీన మొదలై 28వ తేదీ వరకు సాగుతుంది. గత
రెండు విడతల్లోనూ పార్టీ క్రియాశీలక సభ్యులను చేర్చడం కోసం ఎంతో కష్టపడి
పనిచేసిన సుమారు 6,400 మంది పార్టీ వాలంటీర్లకు ఈ సందర్భంగా ప్రత్యేకంగా
అభినందనలు తెలియజేస్తున్నాను. పార్టీ క్రియాశీలక కార్యకర్తల సభ్యత్వ నమోదు,
ప్రమాద బీమా నమోదు నిమిత్తం నా వంతుగా రెండు విడతల్లోనూ రూ.2 కోట్లు విరాళం
ఇచ్చిన విషయం తెలిసిందే. మూడో విడతలోనూ నా వంతుగా కార్యకర్తల బీమా కోసం ఈ నెల
10వ తేదీన నా వంతు విరాళం అందిస్తున్నాను. మూడో విడతలోనూ బలమైన స్ఫూర్తితో
జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు క్రియాశీలక సభ్యత్వ నమోదు
కార్యక్రమాన్ని సమష్టిగా ముందుకు తీసుకువెళ్లి, విజయవంతం చేయాలని
కోరుతున్నానని పవన్ కళ్యాణ్ కోరారు.