నెల్లూరు : గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ఇంటి వద్దకే
నడిచొచ్చేలా సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టిన ఘనత ముఖ్యమంత్రి వైయస్
జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్
ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. సర్వేపల్లి
నియోజకవర్గం వెంకటాచల మండలం ఇడిమేపల్లి గ్రామపంచాయతీ జంగాలపల్లి గిరిజన
కాలనీలో గడపగడపకు మన ప్రభుత్వంలో భాగంగా పర్యటించిన మంత్రికి గ్రామ
ప్రజలు, స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. తొలుత జంగాలపల్లెలో పేదలకు ఇంటి
నివేశ పట్టాలు, పొదుపు గ్రూపులకు బ్యాంకు లింకేజీ రుణాలు, జగనన్న ఇళ్లు
మంజూరైన పొదుపు మహిళలకు ఇంటి నిర్మాణానికి రూ. 35 వేల వడ్డీ లేని రుణాలను
మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అర్హులైన ప్రతి
ఒక్కరికి సంక్షేమ పథకాలను అందిస్తున్నామని, ప్రతి నెల టంఛన్ గా ఇంటి వద్దకే
పింఛన్ ను వాలంటీర్ల ద్వారా చేరుస్తున్నామని, పెద్దఎత్తున ఇంటి స్థలాలు
కేటాయించి ఇల్లు నిర్మించి ఇస్తున్నామని, వైయస్ఆర్ చేయూత, అమ్మ ఒడి, రైతు
భరోసా వంటి అనేక పథకాలను సంతృప్తికర స్థాయిలో అమలు చేస్తున్నామన్నారు. గతంలో
పట్టాలు ఇచ్చి స్థలం చూపడం విస్మరించే వారని, అందుకు భిన్నంగా ఇంటి పట్టా
ఇచ్చి అభివృద్ధి చేసిన ప్లాట్ ను కేటాయించి ఇల్లు నిర్మించుకునేందుకు రూ. 1.80
లక్షల రుణాన్ని మంజూరు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రికే దక్కిందన్నారు. పొదుపు
సంఘాల్లోని మహిళలకు అదనంగా 30 వేల రూపాయల వడ్డీ లేని రుణాన్ని, సర్వేపల్లి
నియోజకవర్గం లోని గిరిజన లబ్ధిదారులకు రూ 15 వేల రూపాయలు అదనపు ఆర్థిక
సహాయాన్ని అందించి పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు కృషి
చేస్తున్నామన్నారు. సంక్షేమ పథకాల ద్వారా లక్షల్లాది రూపాయల లబ్ది ప్రజలకు
చేకూరుతుందని చెప్పారు. గ్రామాల్లో మౌలిక వసతులకు పెద్దపీట వేస్తూ అభివృద్ధి
పనులు చేపడుతున్నా మన్నారు. ఈ కార్యక్రమంలో ఇడమేపల్లి సర్పంచ్ ఉప్పు
యశస్విని, ఎంపీడీవో సుస్మిత, తాసిల్దార్ కృష్ణయ్య, స్థానిక నాయకులు, సచివాలయ
సిబ్బంది, వివిధ శాఖల మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.