న్యూఢిల్లీ : కొవ్వాడలో ఆరు అణు విద్యుత్ కేంద్రాల ఏర్పాటు కోసం
వెస్టింగ్హౌస్ కంపెనీ (అమెరికా)తో చర్చలు జరుపుతున్నట్లు ప్రధాన మంత్రి
కార్యాలయ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ వెల్లడించారు. రాజ్యసభలో
గురువారం వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి
రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం తెలిపారు. వెస్టింగ్ హౌస్ కంపెనీతో చర్చలు
ముగిసిన అనంతరం అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు అయ్యే ఖర్చు, నిర్మాణానికి
పట్టే సమయం వంటి వివరాలతో ప్రాజెక్ట్ ప్రతిపాదనలు ఖరారు అవుతాయని మంత్రి
వివరించారు. ప్రస్తుతానికి ప్రాజెక్ట్ నిర్మాణానికి ముందు జరిగే కార్యకలాపాలు
కొనసాగుతున్నాయి. భూసేకరణ, ప్రాజెక్ట్ ఏర్పాటుకు అవసరమైన అనుమతులు పొందడం,
ప్రాజెక్ట్ స్థలంలో భూమి స్వరూప స్వభావాలపై అధ్యయనం వంటి పనులు
జరుగుతున్నాయి. కొవ్వాడ అణు విద్యుత్ ప్రాజెక్ట్ కోసం 2079 ఎకరాల భూమి
అవసరం ఉంది. ఇప్పటికి 2061 ఎకరాల భూసేకరణ పూర్తయింది. ఈ భూమిని న్యూక్లియర్
పవర్ కార్పొరేషన్ పేరిట బదలాయించడం కూడా పూర్తయిందని మంత్రి తన జవాబులో
పేర్కొన్నారు. అణు విద్యుత్ కేంద్రం నిర్మాణం ఊపుగా జరిగే సమయంలో సుమారు 8
వేల మందికి కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రంలో ఉపాధి లభిస్తుంది. ఈ కేంద్రం
నిర్మాణం పూర్తి చేసుకుని విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించిన అనంతరం ప్రతి
యూనిట్లో 2 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందని అంచనా
వేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్లాంట్లలో వచ్చే ఉపాధి అవకాశాలతోపాటు విద్యుత్
ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభమైన అనంతరం కంట్రాక్టర్లు, వెండర్ల వ్యాపారం
వలన జరిగే ఆర్థిక కార్యకలాపాలతో ఇంకా అనేక మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని
మంత్రి జితేంద్ర సింగ్ వివరించారు.