విజయవాడ : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేయ తలపెట్టిన అంబేద్కర్
స్మృతివనం, అంబేద్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహం పనులు విజయవాడ స్వరాజ్య
మైదానంలో వేగవంతంగా జరుగుతున్నాయి.ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు అంబేద్కర్
స్మృతివనం నిర్మాణ పనులను రాష్ట్ర మున్సిపల్ శాఖ స్పెషల్ సీఎస్ వై.
శ్రీలక్ష్మి అక్కడ జరుగుతున్న పనులను గురువారం పరిశీలించారు.
అంబేద్కర్ స్మృతివనం పనులు పరిశీలించిన వారిలో శ్రీలక్ష్మితో పాటు ఏపీ.ఐ.ఐ.సీ,
వి.సి& ఎం.డి, సృజన, నగర మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ పుండ్కర్ పలువురు
అధికారులు,ఇంజనీర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పెషల్ సీఎస్ శ్రీలక్ష్మి
మీడియాతో మాట్లాడారు. 125 అడుగుల అంబేద్కర్ కాంస్య విగ్రహం నిర్మాణ పనులు
వేగవంతం అయ్యేందుకు, అంబేద్కర్ స్మృతివనం పనులు నాణ్యత పై సీఎం జగన్ ఆదేశాల
మేరకు గురువారం పనులు పరిశీలన చేసినట్లు ఆమె తెలిపారు. నాణ్యతా, ప్రమాణాలపై
కాంట్రాక్టర్ల కు సూచనలు చేయటం జరిగింది అని ఆమె అన్నారు. అంబేద్కర్
స్మృతివనం నిర్మాణ వ్యయం 286 కోట్లు అని, ఈ స్మృతివనం లో ప్రత్యేకంగా 2000
మంది సామర్థ్యం తో ఆడిటోరియం 500 మంది సామర్థ్యంతో ఓపెన్ థియేటర్, ధ్యాన
మందిరం నిర్మాణాలు జరుగుతున్నాయని శ్రీలక్ష్మి తెలిపారు. విజయవాడలో కంట్రోల్
రూమ్ సమీపంలో ఉన్న వైఎస్సార్ విగ్రహం నుండి బందర్ రోడ్డులో అంబేద్కర్
స్మృతివనం వనం వరకు రోడ్డుకు ఇరుప్రక్కల నిర్మాణం చేయనున్న ఫ్లాట్ ఫామ్ లను
ఆకర్షణీయమైన టైల్స్ తో ఆరు కిలోమీటర్ల ప్రాంతాన్ని సుందరీకరణ చేయనున్నట్లు ఆమె
చెప్పారు.2023 ఏప్రియల్ 14 అంబేద్కర్ జయంతి రోజు అంబేద్కర్ 125 అడుగుల కాంస్య
విగ్రహ ప్రతిష్టాపన చేయాలని అనుకుంటున్నట్లు చెపుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్
చేతుల మీదుగా అంబేద్కర్ కాంస్య విగ్రహం ప్రారంభానికి పనులు వేగవంతం అయ్యేందుకు
పరిశీలన చేసినట్లు శ్రీ లక్ష్మీ తెలిపారు.