అమరావతి : కేంద్రం ప్రవేశపెట్టిన 2023-24 బడ్జెట్ సమ్మిళిత అభివృద్ధి లక్ష్యం
సాధించేలా ఉందని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు.
2014లో ప్రపంచంలో 10వ స్థానంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు 5వ
స్థానంలోకి రావడం గొప్ప విషయం అని చంద్రబాబు నాయుడు అన్నారు. నేటి బడ్జెట్ లో
పెట్టుబడి వ్యయం రూ.13.7 లక్షల కోట్లు కేటాయించడం సానుకూలం అని అన్నారు. వచ్చే
25 ఏళ్లకు అంటే 2047 లక్ష్యంగా పథకాలు, కార్యక్రమాల రూపకల్పన దిశగా ఆలోచనలు
చేయడాన్ని చంద్రబాబు స్వాగతించారు. విజన్- 2047 ద్వారా ప్రపంచ అగ్రగామిగా
భారత్ మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అన్ని రంగాల్లో మాక్రో లెవల్
ప్రణాళికలు- మైక్రో లెవల్ అమలు ద్వారా లక్ష్యాలను చేరుకోవచ్చని అన్నారు.
రైతులకు ప్రోత్సాహకంగా రూ.20 లక్షల కోట్లు వ్యవసాయ రుణాలు, పీఎం ఆవాస్ యోజన
పథకం కింద గృహ నిర్మాణం కోసం రూ.79 వేల కోట్లు, ఆక్వారంగానికి రూ.6 వేల కోట్లు
కేటాయించడాన్ని స్వాగతిస్తున్నట్లు చంద్రబాబు నాయుడు తెలిపారు. వ్యవసాయ
రంగానికి సాంకేతికతను అందించే ప్రణాళికలు, ప్రకృతి వ్యవసాయానికి
ప్రోత్సాహాన్ని ఇచ్చే విధంగా బడ్జెట్ ఉండడాన్ని చంద్రబాబు నాయుడు
స్వాగతించారు. వ్యవసాయ రంగానికి టెక్నాలజీని జోడించడం ఫలితాలను ఇస్తుంది
అన్నారు. రొయ్యల మేత తయారీ ముడిసరుకుపై కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు నిర్ణయాన్ని
చంద్రబాబు నాయుడు స్వాగతించారు. దేశంలో ఎక్కువ మందికి ఉపాధి కల్పించే ఎంఎస్ఎంఇ
లకు వడ్డీ శాతం తగ్గించి రూ. 2 లక్షల కోట్లు కేటాయించడం మంచి ఫలితాలను
ఇస్తుందని అన్నారు. రవాణా రంగంలో 100 ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులపై రూ.75
వేల కోట్ల పెట్టుబడులు ఉత్తమ ఫలితాలను ఇస్తాయని చంద్రబాబు నాయుడు అన్నారు.
రైల్వే శాఖకు రూ.2.40 లక్షల కోట్లు కేటాయింపుతో రైల్వే అభివృద్ది వేగవంతం
అవుతుంది అన్నారు. ఆదాయపు పన్ను శ్లాబ్ లలో మార్పులు తెచ్చి వేతన జీవులకు ఊరట
కల్పించడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, ఒబిసిల అభివృద్ధే లక్ష్యంగా
బడ్జెట్ రూపొందిచామన్న ఆర్థిక మంత్రి వ్యాఖ్యలను స్వాగతించిన చంద్రబాబు ఆ
లక్ష్యాలను చేరుకోవడం ద్వారా ఆర్థిక అసమానతలను రూపుమాపాలని అన్నారు.