అమరావతి : నెల్లూరు జిల్లా వైసీపీ లో ముసలంపై సీఎం జగన్ దృష్టి సారించారు.
తమ ఫోన్లను ప్రభుత్వ పెద్దలు ట్యాపింగ్ చేసినట్లు ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ
రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆరోపణలు చేయడంతో ఈ విషయంపై సీఎం ఆరా
తీశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో నిఘా విభాగాధిపతి సీతా రామాంజనేయులు,
హోం శాఖ సెక్రటరీ హరీష్ కుమార్ గుప్త, ప్రభుత్వ సలహాదారు సజ్జల
రామకృష్ణారెడ్డి, మంత్రి బొత్సతో సీఎం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ట్యాపింగ్
చేసిన వ్యవహారంలో నిఘా విభాగాధిపతి ప్రమేయం ఉందని, పలు సాక్ష్యాలను ఎమ్మెల్యే
కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి విడుదల చేసిన దృష్ట్యా వీటిపైనా చర్చించినట్లు
తెలుస్తోంది. పార్టీ, ప్రభుత్వంపై విమర్శలు చేసిన ఎమ్మెల్యేలపై తీసుకోవాల్సిన
చర్యలపై సీఎం చర్చించినట్లు సమాచారం. నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి వైసీపీ
ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని తప్పించి ఆయన స్థానంలో
ఎవరిని నియమించాలనే అంశంపై నేతల అభిప్రాయాలను సీఎం తీసుకున్నట్లు తెలుస్తోంది.
నా ఫోన్ ట్యాప్ చేశారు.. ఆధారాలివిగో : కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి
ఫోన్ ట్యాపింగ్‌పై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి
ఆధారాలను బయట పెట్టారు. తన ఫోన్ ట్యాపింగ్ చేయటం చాలా బాధకరమని ఆయన ఆవేదన
వ్యక్తం చేశారు. తన ఫోన్ ట్యాపింగ్ అవుతోందని నాలుగు నెలల క్రితమే.. ఓ ఐపీఎస్
అధికారి తెలిపినట్లు ఆయన వెల్లడించారు. ఆ అధికారి ఫోన్ ట్యాపింగ్ గురించి తనతో
చెప్పినప్పుడు సీఎం పై కోపంతో అలా చెప్తున్నారని భావించానని అన్నారు. 20 రోజుల
క్రితం తన ఫోన్ ట్యాపింగ్‌పై ఆధారం లభించిందని ఆయన తెలిపారు. ఫోన్ ట్యాపింగ్
నిజమని తెలిసి ఎంతో మనస్తాపం చెందానన్నారు. ముఖ్యమంత్రికి, సజ్జలకు తెలియకుండా
తన ఫోన్ ట్యాప్ కాదని కోటం రెడ్డి అన్నారు. తనను అనుమానించారని తెలిసి చాలా
బాధపడ్డానని, అనుమానం ఉన్నచోట ఉండాలని తనకు లేదని వివరించారు. కొన్నిరోజులుగా
ఇంటెలిజెన్స్ అధికారులు తనపై నిఘా పెట్టారని వెల్లడించారు. అధికార పార్టీ
నేతలపై నిఘా ఎందుకని తాను బాధపడ్డానని పేర్కొన్నారు. కొన్నిరోజుల క్రితం
ఇంటెలిజెన్స్ అధికారులు నేరుగా మీడియా సమావేశంలోనే కనిపించారని అన్నారు.
ఫోన్ ట్యాపింగ్‌పై ప్రెస్‌మీట్ పెడతానని ఎన్నడు అనుకోలేదని అన్నారు. వైసీపీకి
తాను ఎంత వీరవిధేయుడినో అందరికీ తెలుసని, పార్టీ విపక్షంలో ఉన్నప్పుడు
ఎమ్మెల్యేగా ఎంతో పోరాటం చేశానని గుర్తు చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చిన
తర్వాత గుర్తింపు ఇవ్వకపోయినా బాధపడలేదని స్పష్టం చేశారు. వైసీపీ గురించి
ఎక్కడా ఒక్క మాట కూడా పొరపాటుగా మాట్లాడలేదని అన్నారు. మూడున్నరేళ్లుగా ప్రజా
సమస్యలను ప్రస్తావిస్తున్నానని, ఇంత విధేయుడిగా ఉన్న తనను ఎంతగానో
అవమానించారని తెలిపారు. ఎన్నో అవమానాలు భరించి జగన్ కోసం పార్టీలో ఉన్నానని,
ఎప్పుడూ జనంలోనే ఉన్నానని వెల్లడించారు.