విజయవాడ : పాలిటెక్నిక్ పూర్తి చేసిన యువతకు తక్షణం ఉపాధి అవకాశాలు లభించేలా
రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నామని రాష్ట్ర ఐటి ,
నైపుణ్యాభివృద్ది శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ అన్నారు. విద్యార్దులలోని
క్రీడాస్పూర్తిని పెంపొందించి, వారిలో దాగిఉన్న క్రీడా నైపుణ్యాన్ని
వెలుగులోకి తీసుకువచ్చే క్రమంలో ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ మీట్ ను
నిర్వహిస్తున్నామన్నారు. విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో రాష్ట్ర
సాంకేతిక విద్యా శాఖ నేతృత్వవంలో మూడు రోజుల 25వ రాష్ట్ర స్ధాయి పాలిటెక్నిక్
స్పోర్ట్స్ మీట్ ను బుధవారం కార్యదర్శి ప్రారంభించారు. ఈ సందర్భంగా సౌరభ్ గౌర్
మాట్లాడుతూ పాలిటెక్నిక్ విద్యార్ధులకు ఉపాధి పరంగా ఎటువంటి ఇబ్బంది
తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రపంచవ్యాప్త ఆధునిక సాంకేతిక
పోకడలకు అనుగుణంగా పాలిటెక్నిక్ విద్యలో నూతన కోర్సులను ప్రవేశపెట్టాలని
నిర్ణయించామన్నారు. రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమీషనర్ చదలవాడ నాగరాణి
మాట్లాడుతూ విద్యార్ధులు పాఠ్యాంశాలతో పాటు క్రీడలలో కూడా రాణించాలన్నారు.
శారీరక, మానసిన వికాసానికి తోడ్పాటును అందించే క్రీడలకు తమ జీవితంలో ప్రతి
ఒక్కరూ సముచిత ప్రాధన్యత ఇవ్వవలసి ఉందన్నారు. పారిశ్రామిక రంగానికి కావాలసిన
విధంగా విద్యార్ధులను తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి
ఆదేశించారని, తదనుగుణంగా పారిశ్రామిక వేత్తలతో సమావేశాలు నిర్వహించి కార్యాచరణ
సిద్దం చేసామన్నారు. ఇప్పటికే పూర్వపు జిల్లాల స్దాయిలో స్టోర్ట్స్ మీట్ లు
పూర్తికాగా, అక్కడ విజయం సాధించిన 1500 మంది విద్యార్ధులు మొత్తం 19 అంశాలలో
పోటీ పడుతున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుండి విద్యార్ధులు హాజరుకాగా,
వారి సౌకర్యార్ధం బస్టాండ్, రైల్వే స్టేషన్స్ నుండి బస్సులు ఏర్పాటు చేసారు.
క్రీడాకారులకు అవసరమైన పౌష్టికాహారం, వసతిని అందించారు.
అబ్బుర పరిచిన విద్యార్ధులు మార్చ్ ఫాస్ట్
స్పోర్ట్స్ మీట్ నేపధ్యంలో అయా జిల్లాల క్రీడా బృందాల నుండి అధికారులు గౌరవ
వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా విద్యార్ధులు నిర్వహించిన మార్చ్ ఫాస్ట్
ఆహుతులను ఆకర్షించింది. మార్చ్ ఫాస్ట్ కు అగ్రస్ధానంలో సీనియర్ విద్యార్ధినులు
సాంప్రదాయ వస్త్ర ధారణలో జాతీయ జెండాలు చేతబూని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
వీరి వెంబడి అయా జిల్లాల నుండి వచ్చిన క్రీడా బృందాలు సుశిక్షితులై కవాతు
నిర్వహించాయి. అనంతరం సౌరభ్ గౌర్, నాగరాణి తదితరులు క్రీడా జ్యోతిని
వెలిగించారు. రంగురంగుల బెలూన్ లను గాలిలోకి వదిలారు. క్రీడా ప్రాంగణం అంతా
రంగులు వెదజల్లేలా ప్రత్యేక బాణసంచా సామాగ్రిని కాల్చటంతో పాటు, బాంబులతో
హోరెత్తించారు. క్రీడా సంబర ప్రారంభ సూచకంగా సాంకేతిక విద్యాశాఖ కార్యదర్శి
వాలీబాల్, సంచాలకురాలు టేబుల్ టెన్నిస్ ఆటలను ఆడి విద్యార్ధులను ఉత్సాహ
పరిచారు.