న్యూ ఢిల్లీ : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ముందు రక్షణ మంత్రి రాజ్ నాథ్
సింగ్ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొని ఆంధ్రప్రదేశ్
రాష్ట్రానికి సంబందించి అనేక పెండింగ్ అంశాలను పరిష్కరించాలని కోరినట్టు
రాజ్యసభ సభ్యులు, వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి తెలిపారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి
అదేశాలమేరకు ప్రత్యేక తరగతి హోదా, కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటు, పెండింగ్
ప్రాజక్టుల పరిష్కారంతో పాటుగా రాష్ట్రానికి సబంధించిన ఇతర అనేక అంశాలకు
కూడా సమావేశంలో ప్రస్తావించినట్టు వెల్లడించారు. ట్విట్టర్ వేదికగా ఆయన పలు
అంశాలు వెల్లడించారు. రాష్ట్రంలో నిరుపేద, అణగారిన వర్గాల ప్రజల అభివృద్ధి
కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం రూ.
1.82లక్షల కోట్లు డీబీటీ (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్) ద్వారా లబ్ధిదారుల
ఖాతాల్లో జమచేసిందని విజయసాయి రెడ్డి అన్నారు. ఎటువంటి వివక్షకు తావులేకుండా
పూర్తి పారదర్శకంగా చేపట్టిన నగదు బదిలీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 11.43%
అభివృద్ధి రేటుతో దేశంలోనే అగ్రభాగాన నిలిచేలా సహాయపడిందని అన్నారు. కేంద్ర
ప్రభుత్వం 15 సంవత్సరాలు పైబడిన ప్రభుత్వ వాహనాలను రోడ్లపై తిరగకుండా
నిషేధిస్తున్నట్లు తీసుకున్న నిర్ణయం ప్రశంసనీయమని విజయసాయి రెడ్డి అన్నారు.
ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా వాయు
కాలుష్యం తగ్గుతుందని అన్నారు. ఏప్రిల్ 1 నుంచి ఈ వాహనాలు నిషేదించబడతాయని
వాటిస్థానంలో కొత్త వాహనాలు అందించనున్నట్లు తెలిపారు. విశాఖ నగరానికి చెందిన
పర్వతారోహకుడు అన్మిష్ వర్మ అరుదైన ఘనత సాధించడం రాష్ట్రానికే గర్వకారణమని
విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఏడు దేశాల్లో ఎత్తైన శిఖరాలు అధిరోహించి
రికార్డు సృష్టించాడని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహకారంతో ఈ
యువకుడు తన కలలను సాకారం చేసుకోవడం తో పాటు మనల్ని గర్వపడేలా చేశాడని ఆయన
అన్నారు.