విజయవాడ : రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ బుధవారం నుండి 3వ తేదీ వరకు విజయవాడ
ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న రాష్ట్ర
స్ధాయి పాలిటెక్నిక్ స్పోర్ట్స్ మీట్ కు అన్ని ఏర్పాట్టు పూర్తి అయ్యాయని
కమీషనర్ చదలవాడ నాగరాణి తెలిపారు. రాష్ట్ర అర్ధిక శాఖ మంత్రి బుగ్గన
రాజేంద్రనాధ్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరుకానుండగా, గృహ
నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, స్ధానిక ఎంఎల్ ఎ, ఎపి ప్లానింగ్ బోర్డు వైస్
ఛైర్మన్ మల్లాది విష్ణు తదితరులు పాల్గొననున్నారన్నారు. రాష్ట్రంలోని నాలుగు
రీజియన్ల నుండి దాదాపు 1700 మంది విద్యార్ధులు ఈ పోటీలలో
పాల్గొననున్నారన్నారు. మొత్తం 19 అంశాలలో విద్యార్దులు పోటీ పడనున్నారని
నాగరాణి తెలిపారు. గత 24 సంవత్సరాలుగా కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా ఇది 25వ
మీట్ కానుందని, ఇప్పటికే పూర్వపు జిల్లాల స్దాయిలో స్టోర్ట్స్ మీట్ లు
పూర్తికాగా, అక్కడ ప్రధమ , ద్వితీయ స్దానాలు దక్కించుకున్న వారు రాష్ట్ర
స్ధాయికి అర్హత సాధించారని నాగరాణి తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల
నుండి పెద్ద ఎత్తున హాజరవుతున్న విద్యార్ధుల సౌకర్యార్ధం బస్టాండ్, రైల్వే
స్టేషన్స్ నుండి బస్సులు ఏర్పాటు చేసామని, క్రీడాకారులకు మంచి ఆహారం, వసతి
సిద్దం చేసామని పేర్కొన్నారు. విద్యార్దులలోని క్రీడాస్పూర్తిని పెంపొందించి,
వారిలో దాగిఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలుగులోకి తీసుకువచ్చే క్రమంలో ఇంటర్
పాలిటెక్నిక్ స్పోర్ట్స్ మీట్ ను నిర్వహిస్తున్నామని సాంకేతిక విద్యా శాఖ
సంచాలకురాలు చదలవాడ నాగరాణి తెలిపారు.