మూడు నెలల్లో 27 లక్షల మందికి వైద్య సేవలు
విజయవాడ : రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికి వైద్యం అందించే
లక్ష్యంగా ప్రవేశపెట్టిన ఫ్యామిలీ డాక్టర్ ట్రయల్ రన్ సూపర్ సక్సెస్ అయ్యిందని
రాజ్యసభ సభ్యులు, వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయ సాయి రెడ్డి
పేర్కొన్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా సోమవారం పలు అంశాలను వెల్లడించారు.
ట్రయల్ రన్ లో భాగంగా కేవలం మూడు నెలల్లో 27 లక్షల మందికి వైద్య సేవలందినట్లు
తెలిపారు. 104 వాహనంతో పాటు డాక్టర్ ఇతర వైద్య సిబ్బంది గ్రామాల్లో పర్యటించి
వైద్యసేవలందిస్తున్నారని అన్నారు. వివిధ రకాల వ్యాధులకు సంబందించి వైద్య
పరీక్షలు నిర్వహిస్తున్నారని అన్నారు. 30 ఏళ్లు దాటిన వారిలో 92% మందికి
స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. జగనన్న చేదోడు పథకం కింది
330.15 కోట్ల నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జమ
చేసారని విజయసాయి రెడ్డి తెలిపారు. 3,30,145 మందికి వరుసగా మూడో ఏడాది లబ్ధి
చేకూరిందని అన్నారు. దుకాణాలు ఉన్న దర్జీలు, రజకులు, నాయీ బ్రాహ్మణులకు చేదోడు
కింద ఏటా రూ.10,000 జమ చేస్తున్నట్లు తెలిపారు. ఒడిశా రాష్ట్ర ఆరోగ్యశాఖ
మంత్రి నాబా కిషోర్ దాస్ హత్యకు గురైన సంఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని
విజయసాయి రెడ్డి అన్నారు. రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతితో కలిసి ఈ సంఘటలనపై
దిగ్బ్రాంతి వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఆయన కుటుంబ సభ్యలకు మనోధైర్యాన్ని
ప్రసాదించాలని భగవంతుని కోరుతున్నానని అన్నారు. గర్భాశయ ముఖద్వారం (సర్వైకల్
క్యాన్సర్ ) నియంత్రణకు హెపీవీ వ్యాక్సిన్ ఇవ్వాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం
ప్రశంసనీయమని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. దేశంలో ఏటా 35000 మంది స్త్రీలు ఈ
వ్యాధితో మరణిస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయని అన్నారు. 9 నుండి 14
సంవత్సరాల వయస్సు గల బాలికలకు ఈ వ్యాక్సిన్ ఫ్రీగా వేస్తారని ఈ మేరకు 16 కోట్ల
డోసులకు ఏప్రిల్ లో టెండర్ పిలవడం జరుగుతుందని అన్నారు. వైద్య పరికరాల విషయంలో
భారతదేశం అమెరికా, చైనా వంటి దేశాలపై ఇప్పటికీ ఆధారపడుతోందని విజయసాయి రెడ్డి
అన్నారు. 80% వైద్య పరికరాలు ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకుంటున్న వేనని
అన్నారు. వైద్య పరికరాలు తయారీ విషయంలో భారతదేశం స్వయం సమృద్ది సాధించాలని
అన్నారు. ఈ మేరకు వైద్య పరికరాల తయారీ దారులకు ప్రోత్సాహకాలు అందించాలని ఆయన
అన్నారు.