మహాత్మా గాంధీ దేవాలయంలో పలువురు ప్రముఖుల నివాళి
విజయవాడ : మహాత్ముని జీవితం ప్రపంచానికి ఆదర్శప్రాయమని పలువురు వక్తలు
నివాళులర్పించారు. సోమవారం సయ్యద్ అప్పలస్వామి కళాశాల ప్రాంగణంలోని మహాత్మా
గాంధీ దేవాలయంలో ఇండియన్ సివిలైజేషన్ గాంధీ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు
రాంపి ళ్ల జయప్రకాష్ ఆధ్వర్యంలో గాంధీజీ వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ
కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్)
అసిస్టెంట్ సూపరింటెండెంట్ డేగ ప్రభాకర్ మాట్లాడుతూ గాంధీజీని స్ఫూర్తిగా
తీసుకుని విద్యార్థులు దేశభక్తితో ఎదగాలని విద్యార్థిని విద్యార్థులు డ్రగ్స్
,ఆల్కహాల్, తదితర మత్తు పదార్థాలకు, దురలవాట్లకు దూరంగా ఉండాలని కోరారు.
డ్రగ్స్ వలన వచ్చే దుష్ప్రభావాలను ఆయన వివరించారు. ప్రణాళికాబద్దంగా ఉన్నతమైన
లక్ష్యంతో విద్యార్థులు ఎదగాలని సూచించారు. ఇండియన్ సివిలైజేషన్ గాంధీ
ట్రస్ట్ చైర్మన్ రాంపిళ్ళ జయప్రకాష్ మాట్లాడుతూ గాంధీజీ అహింస, శాంతి యుత
పోరాటంతో మనదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారని కొనియాడారు. తమ తల్లిదండ్రులు
సర్దార్ రాంపిళ్ళ సూర్యనారాయణ నరసాయమ్మ దంపతులు బ్రిటిష్ వారిపై దాడి
చేసేందుకు బాంబులు తయారు చేశారని, అటుపై గాంధీ మార్గం గొప్పతనాన్ని గుర్తించి
గాంధీ మార్గంలో వారు పయనించారని చెప్పారు. తాము ప్రవేశపెట్టిన గాంధీ దీక్షలు
ఎంతో సత్ఫలితాన్నిచ్చాయని చెప్పారు. దేశభక్తితో విద్యార్థులు ఎదగాలని, తమ
శక్తి సామర్ధ్యాలను దేశం కోసం వినియోగించాలని సూచించారు. ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీ
కార్యదర్శి గోళ్ల నారాయణరావు మాట్లాడుతూ మహాత్మా గాంధీ జీవితాన్ని ప్రతి
ఒక్కరు అనుసరించాలని కోరారు. దేశం మొత్తాన్ని ఏకతాటిపైకి తెచ్చి నడిపించిన
మహనీయుడు మహాత్మా గాంధీ అని కొనియాడారు. తొలుత మహాత్మా గాంధీ విగ్రహానికి
ప్రముఖ స్వాతంత్ర సమరయోధురాలు రాంపిళ్ళ నరసాయమ్మ పాలాభిషేకం చేసి పుష్పమాలవేసి
నివాళులర్పించారు. సయ్యద్ అప్పల స్వామి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ దండాబత్తిన
సరళ మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధులు ఈ కాలేజీని నెలకొల్పారని, అతి తక్కువ
ఫీజులతో మంచి విద్యను విద్యార్థులకు అందజేస్తున్నామని వివరించారు.
కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ సంఘం ప్రధాన కార్యదర్శి మోతుకూరి
వెంకటేశ్వరరావు, ఇండియన్ సివిలైజేషన్ గాంధీ ట్రస్ట్ డైరెక్టర్లు తమ్మిన
సోనియా, తమ్మిన హనుమ, సయ్యద్ అప్పలస్వామి కళాశాల పాలకవర్గ సభ్యులు తమ్మిన
మారుతి, ఎస్ ఎ ఎస్ జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ రాంపండు నాయక్, పలువురు
అధ్యాపకులు,పెద్ద సంఖ్యలో విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.